ధరణి Vs భూభారతి.. 18 లక్షల ఎకరాలకు అసలు ఓనర్ ఎవరు? లెక్కతేలాలి..!
భూమి అనేది ఒక బరువైన సెంటిమెంట్..! బలమైన భావోద్వేగం. అరెకరం భూమి ఉన్నా సన్నకారోడైనా, వందెకరాలున్న భూస్వామైనా... నేలతల్లితో వాళ్లకుండే ఎటాచ్‌మెంటే వేరు. సగటు రైతు తన భూమిని ఆత్మగా భావిస్తాడు, దాంతో బంధుత్వం కలుపుకుంటాడు. తనది అనుకున్న భూమ్మీద ఎవ్వడొచ్చి చెయ్యి పెట్టినా సహించలేడు. ఓనర్‌షిప్ ప్రశ్నార్థకమైనప్పుడు.. భూమ్మీద తనకుండే హక్కును లాక్కోవాలని చూస్తే తల్లడిల్లిపోతాడు. ఒక్కోసారి తిరగబడతాడు. భూతగాదాల్లో సొంత కుటుంబాల్నే కాదనుకున్న రక్తచరిత్రలను చాలానే చూశాం. మరి, అవతలోడొచ్చి మన భూమిని రోడ్డు మీదకు లాగితే? ఊరుకుంటాడా? గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేగా జరిగింది..! ఏకంగా ప్రభుత్వాలనే మార్చేసింది భూ సెంటిమెంట్. ఏపీలో పాస్‌బుక్కు మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండడాన్ని రైతు ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో ఓడిపోయిన పార్టీకి తర్వాత తెలిసొచ్చింది. తెలంగాణలో ధరణి వెబ్‌సైట్ మీద వ్యతిరేక ప్రచారం పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీని మట్టికరిపించింది. ఇప్పుడు మళ్లీ ఆ ధరణి చట్టాన్నే తవ్వితీసి, మరో ఎలక్షన్‌కి సై అంటోంది రూలింగ్ పార్టీ. ధరణి భూస్థాపితమైన దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ల్యాండ్‌మైనింగ్ దేనికోసం..? ప్రభుత్వ అంతరార్థం ఏమై ఉంటుంది..?

భూమి గుండ్రంగా ఉండును, తన చుట్టూ తానే తిరుగును.. అన్నట్టుంది తెలంగాణలో పరిస్థితి. పన్నెండేళ్లుగా రైతు భూమి చుట్టూనే చక్కర్లు కొడుతోంది రాజకీయం. ఆరేళ్ల కిందట కేసీఆర్ జమానాలో అక్టోబర్‌లో అఫీషియల్‌గా జనంలోకి వచ్చిన ధరణి పోర్టల్.. తర్వాత ప్రభుత్వం మారి, వాళ్లన్నట్టే బంగాళాఖాతంలో కలిసిపోయింది. దాని స్థానంలో భూభారతి పేరుతో కొత్త చట్టమొచ్చి చేరింది. స్పాన్సర్డ్ బై రేవంత్ సర్కార్. కానీ, ఏడాది కిందట భూస్థాపితమైన ధరణి చట్టాన్ని మళ్లీ తవ్వితీసి అక్రమాల నిగ్గు తేల్చాలని డిసైడైంది రేవంత్ సర్కార్. తెలంగాణలో తాజా భూకంపం పర్యవసానాలేంటి? ఎన్ని లక్షల ఎకరాలకు ఓనర్‌షిప్పును తేలుస్తుంది? ఎవరెవరి కిందకు నీళ్లొస్తాయి..? అపోజిషన్ పార్టీకయ్యే డ్యామేజ్ ఎంత? పరిశీలిద్దాం.. మాజీ సీఎం కేసీఆర్ మానసపుత్రిక ధరణికి కొత్తగా క్లయిమాక్స్ రాసుకున్నట్టుంది రేవంత్ సర్కార్. ధరణి చట్టంపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ఏర్పాటు చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని చేతికి బెత్తం అందుకుంది రేవంత్ సర్కార్. భూ రికార్డులను తారుమారు చేసినవాళ్లను, అక్రమ మ్యూటేషన్లకు పాల్పడినవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అవసరమైతే మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తోంది. ధరణి అమలు టైమ్‌లో జరిగిన లావాదేవీలన్నీ రేవంత్ టేబుల్ మీదికి రాబోతున్నాయి. ధరణి పోర్టల్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ నుంచి, తర్వాత వచ్చిన అవినీతి ఆరోపణల దాకా.. అన్నీ కార్నర్స్‌లోకి దూరి లోతుగా విచారించబోతోంది స్పెషల్ ఎంక్వైరీ టీమ్.. ఎస్‌ఈటీ. – ఇది సిట్ కాదు.. సెట్.. అని నొక్కి చెబుతోంది...
