బాసర క్షేత్రంలో చారిత్రక ఘట్టం.. బాలాలయంలోకి చదువుల తల్లి.. గర్భగుడి మూసివేత!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. శృంగేరి శారదా పీఠం జగద్గురువుల ఆశీస్సులతో సరస్వతి, మహంకాళి, లక్ష్మీదేవి అమ్మవార్లను శాస్త్రోక్తంగా బాలాలయంలోకి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన గర్భగుడిని భక్తుల దర్శనార్థం మూసివేశారు. ఇకపై పనులు పూర్తయ్యే వరకు భక్తులు ..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం సరికొత్త రూపం సంతరించుకోనుంది. ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం సరస్వతి, మహంకాళి, లక్ష్మీదేవి అమ్మవార్లతో పాటు ఇతర దేవతామూర్తులను ప్రధాన గర్భాలయం నుండి బాలాలయానికి తరలించి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు.
శృంగేరి పీఠం ఆధ్వర్యంలో శాస్త్రోక్త పూజలు:
కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో, బ్రహ్మశ్రీ తంగిరాల సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో దేవస్థాన వైదిక బృందం ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించింది. విశేష ద్రవ్య అభిషేకం, స్థాపిత దేవతా మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి అనంతరం అమ్మవార్లను మంగళవాయిద్యాల నడుమ బాలాలయానికి తీసుకొచ్చారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్, ఆలయ దాతలు సురపునేని సునంద్-పద్మప్రియ దంపతులతో కలిసి భూమిపూజ చేశారు.
గర్భగుడి మూసివేత.. ఇకపై బాలాలయంలోనే దర్శనం:
ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యేంతవరకు ప్రధాన గర్భగుడిలో భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు. గర్భాలయంలో కేవలం అర్చకులు మాత్రమే ఆగమశాస్త్ర ప్రకారం నిత్యపూజలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనాలతో పాటు నిత్య పూజలు, మహా మంగళహారతి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పిల్లల అక్షరాభ్యాసాలన్నీ ఇకపై బాలాలయంలోనే యథావిధిగా కొనసాగుతాయి. గర్భాలయం మూసివేసే ముందు చివరి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరస్వతి తల్లి దర్శనానికి అనుమతిచ్చారు. 2.30 గంటలకు ఆలయ ఈవో అంజనీదేవి ఆధ్వర్యంలో వేద పండితులు ఆలయాన్ని మూసి వేశారు. ఆదివారం ఒక్కరోజే 951 అక్షరాభ్యాసాలు జరగడం విశేషం.
వీడియో ఇక్కడ చూడండి..
తెలంగాణలోనే ఎత్తయిన గోపురం!:
బాసర ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కులా ఎత్తయిన గోపురాలను నిర్మించనున్నారు. తూర్పు-పడమర గోపురాలను 5 అంతస్తులు, దక్షిణ గోపురాన్ని 7 అంతస్తులుగా నిర్మిస్తుండగా.. ఉత్తర గోపురాన్ని ఏకంగా 9 అంతస్తుల (నవ తల)తో నిర్మించనున్నారు. యాదాద్రి ఆలయంలోని గోపురం 7 అంతస్తుల ఎత్తుండగా, బాసరలో నిర్మించే 9 అంతస్తుల ఉత్తర గోపురం తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన గోపురంగా నిలవనుందని అధికారులు తెలిపారు.
అభివృద్ధి పనులు:
ప్రభుత్వ ఆమోదంతో ప్రధాన గర్భాలయంతో పాటు అనివేటి మండపం, మహంకాళి ఆలయం, ప్రాకార మండపాలు, క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపాలు, నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులను అంగరంగ వైభవంగా చేపట్టనున్నారు.




