ఇసుక తవ్వుతుంటే బయటపడ్డ నగరం.. మృతుల నోట్లో బంగారు నాలుకలు!
1,700 సంవత్సరాల చరిత్ర ఎడారి దూళి కింద పూడ్చిపెట్టి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు అలాంటిదే కనుగొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆశ్చర్యపరిచారు. ఒకవైపు, నాలుగవ శతాబ్దానికి చెందిన పూర్తిస్థాయిలో జనావాసాలున్న ఒక నగరాన్ని గుర్తించారు.. మరోవైపు, సమాధులలో లభించిన బంగారు నాలుక కొత్త ఉత్కంఠను రేకెత్తించింది.

ఈజిప్ట్ ఎడారి ఎప్పుడూ తన గర్భంలో ఎన్నో చారిత్రక రహస్యాలను దాచుకుంటూనే ఉంటుంది. తాజాగా, అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాల్లో 1700 ఏళ్ల నాటి ఒక రహస్య నగరం, వింతైన మమ్మీలు బయటపడ్డాయి. ఈ అన్వేషణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులను, శాస్త్రవేత్తలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇసుక కింద దాగివున్న బీజాంటైన్ నగరం:
ఈజిప్ట్‌లోని దఖ్లా ఒయాసిస్ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో నాల్గవ శతాబ్దానికి చెందిన ఒక వ్యవస్థీకృత బీజాంటైన్ నగరం వెలుగుచూసింది. ఇది కేవలం శిథిలాల కుప్ప కాదు.. నాటి ఇళ్ల వరుసలు, వీధులు, ఒక పెద్ద చర్చి కూడా ఇందులో సురక్షితంగా ఉన్నాయి. ఆ కాలపు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతూ దట్టమైన గోడలు, గుమ్మటాల ఆకారపు పైకప్పులు లభించాయి. అంతేకాదు, నాటి ప్రజలు రొట్టెలు కాల్చుకునే పాతకాలపు పొయ్యిలు, ధాన్యం విసిరే రాళ్లు కూడా చెక్కుచెదరకుండా దొరికాయి.
రోమన్ బంగారు నాణేలు.. వ్యాపార లెక్కలు:
ఈ నగరంలో రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటియస్ II (క్రీ.శ. 337 – 361) కాలానికి చెందిన అమూల్యమైన బంగారు నాణేలు లభించాయి. వీటితో పాటు ఓస్ట్రాకా అని పిలిచే సుమారు 200 మట్టి పాత్రల ముక్కలు దొరికాయి. వాటిపై ఆ కాలంలో జరిగిన వ్యాపార లావాదేవీల లెక్కలు రాసి ఉన్నాయి. అంటే నాటి కాలంలో ఆ నగరం ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా విలసిల్లిందని దీని ద్వారా అర్థమవుతోంది.
బంగారు నాలుకల అసలు రహస్యం ఏమిటి?:
ఈ త్రవ్వకాల్లో అన్నింటికంటే వింతైన, ఒళ్ళు గగుర్పొడిచే విషయం మరొకటి ఉంది. అలెగ్జాండ్రియా సమీపంలోని మరీనా అల్-అలమీన్ వద్ద దాదాపు 18 పురాతన సమాధులు కనుగొనబడ్డాయి. ఆ సమాధుల్లోని అస్థిపంజరాల నోళ్లలో బంగారు నాలుకలు ఉంచబడి ఉన్నాయి. నాటి ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం.. మనిషి చనిపోయిన తర్వాత పరలోకంలో ఉండే ఒసిరిస్ వంటి దేవతలతో మాట్లాడటానికి, వారి తీర్పును ఎదుర్కోవడానికి వీలుగా ఈ బంగారు నాలుకలను నోటిలో పెట్టే ఆచారం ఉండేదట.
ఈ అద్భుతమైన ఆవిష్కరణ కేవలం పురాతన ఇటుకలు, రాళ్లను మాత్రమే కాకుండా, వేల సంవత్సరాల క్రితం ఎడారిని తమ నివాసంగా మార్చుకుని జీవించిన మనుషుల జీవనవిధానాన్ని, వారి వింత నమ్మకాలను ప్రపంచానికి చాటిచెబుతోంది.




