Telangana: ప్రాణం తీసిన మొబైల్ ఛార్జర్.. ఫోన్ ఛార్జింగ్ పెట్టేముందు ఇది తప్పక తెలుసుకోండి!
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై 28 ఏళ్ల హన్మంతు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్విచ్ బోర్డు ప్రమాదకరంగా ఉన్నందుకే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన హన్మంతు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం కవిత అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు సంతానం. హన్మంతు దంపతులు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే ఆదివారం సాయంత్రం హన్మంతు తన ఫోన్‌కు ఛార్జింగ్‌కు పెడదామని ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లాడు. ఛార్జర్ పెట్టి స్విచ్ వేయగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు హన్మంతు. గమనించిన భార్య కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. ఇక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే స్విచ్ బోర్డు ప్రమాదకరంగా ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమింకగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త మరణించడంతో అతని భార్య కవిత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన చింతలకుంట గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఫోన్ ఛార్జింగ్ పెట్టేప్పుడు ఇవి తెలుసుకోండి
- మీరు ఫోన్ ఛార్సింగ్ పెట్టేప్పుడు తడి చేతులతో స్విచ్ బోర్డులు, ప్లగ్‌లు, ఛార్జింగ్ కేబుల్స్ లేదా ఫోన్‌ను తాకకూడదు.
- వైర్లు తెగిపోయినా, బయటకు కనిపిస్తున్నా లేదా ఛార్జింగ్ పిన్ వంగిపోయినా అలాంటి కేబుల్స్, అడాప్టర్లను వెంటనే మార్చేయండి
- మీ ఫోన్లకు కంపెనీ నుంచి వచ్చిన ఛార్జర్‌లను మాత్రమే వాడండి. నకిలీ ఛార్జర్స్ వాడితే కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
- సాకెట్‌లో ఛార్జర్ పెట్టేటప్పుడు లేదా తీసేటప్పుడు ముందుగా స్విచ్ ఆఫ్ చేయండి.
- బాత్రూమ్‌లు, కిచెన్ సింక్‌లు లేదా వర్షం పడే కిటికీల దగ్గర ఉన్న సాకెట్లలో ఫోన్ ఛార్జింగ్ పెట్టకండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
