Hyderabad Rains: నీట మునిగిన హైదరాబాద్… వాహనదారులను వెంటాడిన ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నగరం జలమయం అయింది. ఒక్కసారిగా దంచికొట్టడంతో పలు కాలనీలు, రోడ్లు చెరువులను తలపించాయి. సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఇక.. ఎప్పటిలాగే.. వాహనదారులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడాయి. సికింద్రాబాద్, బేగంపేట, రసూల్‌పురా ఏరియాల్లోని లోతట్టు...

హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నగరం జలమయం అయింది. ఒక్కసారిగా దంచికొట్టడంతో పలు కాలనీలు, రోడ్లు చెరువులను తలపించాయి. సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఇక.. ఎప్పటిలాగే.. వాహనదారులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడాయి.
సికింద్రాబాద్, బేగంపేట, రసూల్‌పురా ఏరియాల్లోని లోతట్టు కాలనీలు వాన నీటితో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నడుముల్లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. ప్యాట్నీ నాలా పరిధిలోనూ ఇళ్లు నీట మునిగాయి. సికింద్రాబాద్ పైగాకాలనీ భారీ వర్షానికి అతలాకుతలం అయింది. ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో స్థానికులను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పైగాకాలనీలోని సహాయక చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తూ స్థానికులకు భరోసా కల్పించారు.
కొండాపూర్‌లోనూ భారీ వర్షం కురిసింది. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై మోకాళ్ల లోతు వరద నీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అయ్యింది. కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతంలో రోడ్లు వరదనీటితో మునిగిపోయాయి. హైటెక్‌సిటీ, మాదాపూర్‌లోనూ రోడ్లు జలమయం అయ్యారు. హిమాయత్‌నగర్, కోఠి, మలక్‌పేట న్యూ మార్కెట్, నాచారం ఏరియాలు చెరువులను తలపించాయి. జీడిమెట్లలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చాంద్రాయణగుట్టలో భారీ వర్షానికి సీఆర్‌పీఎఫ్ కార్యాలయం ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలింది. ఓ కారు వెళ్తున్న సమయంలో 15అడుగుల గోడ కూలిపోగా అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చంద్రాయణగుట్ట పరిధిలోని మోయిన్‌బాగ్‌లో పదుల సంఖ్యలో వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని రోడ్లపైకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. విర్కో ల్యాబరేటరీస్ ప్రాంతం నదిని తలపించింది. మేడ్చల్ పరిధిలోని కొంపల్లిలోనూ రోడ్లపైకి వరద నీరు పోటెత్తింది. మొత్తంగా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షం మరోసారి ముంచెత్తింది.
