Weather Alert: దూసుకువస్తున్న అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఓ వైపు రుతుపవనాలు.. మరోవైపు అల్పపీడనం.. దీంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా కొనసాగుతోంది..

ఓ వైపు రుతుపవనాలు.. మరోవైపు అల్పపీడనం.. దీంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా కొనసాగుతోంది.. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 3 రోజులు ఈదురుగాలులతోపాటు.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కురిసే అవకాశం ఉందన్నారు.
ఎల్లో అలర్ట్..
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే.. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవాళ హైదరాబాద్‌తోపాటు.. అంతటా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలాఉంటే.. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
