AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Scam: జీఎస్టీకి జీరో దందా దెబ్బ.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3500 కోట్ల ఎగవేత.. షాక్‌లో అధికారులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ మార్గంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (Goods & Service Tax) ఎగ్గొట్టేందుకు తెలంగాణ వ్యాపారులు పెద్ద ప్లాన్ అమలు చేయడంతో ఖజానాకు ఏకంగా...

GST Scam: జీఎస్టీకి జీరో దందా దెబ్బ.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3500 కోట్ల ఎగవేత.. షాక్‌లో అధికారులు
Gst
Rajesh Sharma
|

Updated on: Apr 15, 2021 | 6:33 PM

Share

GST Scam in Telangana State: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ మార్గంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (Goods & Service Tax) ఎగ్గొట్టేందుకు తెలంగాణ (TELANGANA) వ్యాపారులు పెద్ద ప్లాన్ అమలు చేయడంతో ఖజానాకు ఏకంగా రూ.3500 కోట్ల రూపాయలు మేరకు గండి పడినట్లు సమాచారం. లాక్ డౌన్ (LOCK DOWN) పీరియడ్‌లో సరిగ్గా తనిఖీలు నిర్వహించకపోవడాన్ని వ్యాపార, వాణిజ్య వర్గాలు అనుకూలంగా మల్చుకుని.. ఖజానాకు సున్నం పెట్టాయని వాణిజ్య పన్నుల శాఖ (COMMERCIAL TAX) అధికారులు తాజాగా నిర్ధారణకు వచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంతర్గతంగా నిర్వహించిన స్క్రూటినీలో లాక్ డౌన్ పీరియడ్‌లోను, ఆ తర్వాత కూడా తనిఖీలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని పన్ను ఎగ్గొట్టేలా జీరో దందా (ZERO BUSINESS)ల నిర్వహణ పెద్ద ఎత్తున జరిగినట్లు అంఛనాకు వచ్చారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ (GST) వసూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న వాణిజ్య శాఖ రూ.3500 కోట్ల మేరకు పన్ను ఎగవేత జరిగినట్టుగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్రం (TELANGANA STATE)లోకి పెద్ద ఎత్తున జీరో సరుకు వచ్చిందని వాణిజ్య పన్నుల అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ (ELECTRONIC)‌ పరికరాలు, మొబైల్‌ (MOBILE) ఫోన్లు, స్టీల్ (STEEL)‌ ఉత్పత్తులతో పాటు, మరికొన్ని వస్తువులు ఎలాంటి బిల్లులు, ఇన్వాయిస్‌లు లేకుండా రాష్ట్రాల చెక్‌పోస్టులు దాటి జీరో సరుకు రూపంలో రాష్ట్రంలోకి ప్రవేశించడం, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ని కూడా డీలర్లు ఎక్కువగా క్లెయిమ్‌ (CLAIM) చేసుకోవడం వల్ల పన్ను ఎగవేత ఈసారి రూ.3,500 కోట్లు మించిందని అంతర్గత లెక్కల్లో తేల్చినట్టు తెలుస్తోంది. వీటితోపాటు దుస్తులు, కరోనా (CORONA) కాలంలో విరివిగా వినియోగిస్తున్న మాస్కులు (MASKS), శానిటైజర్లు (SANITIZERS), ఫార్మా (PHARMA) ఉత్పత్తుల్లోనూ పన్ను ఎగవేతలు భారీ ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో మాదిరిగా కాకుండా ఈసారి పన్ను ఎగవేతలు చోటుచేసుకోకుండా.. పకడ్బందీ ప్రణాళికలు రూపొందించే పనిలో కమర్షియల్ టాక్స్ విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. రాబడి లోటును అధిగమించడమే కాకుండా పన్ను ఎగవేత, ఇతర రూపాల్లోని అక్రమాలను అరికట్టేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 460 ప్రత్యేక బృందాలను నియమించారు. ఇందులో మొత్తం 1,370 మంది వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బందిని సభ్యులుగా నియమించారు. అక్రమాలను గుర్తించి శాఖకు రావాల్సిన రాబడిని నష్టపోకుండా చూసేందుకు గాను స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.

నిరంతర నిఘాతో అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఈ-ఇన్వాయిస్‌లు పక్కాగా అమలయ్యేలా, చెక్‌పోస్టుల వద్ద జీరో సరుకు సరిహద్దులు దాటకుండా పహారా కాయాలని వాణిజ్య పన్నుల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం చెక్‌పోస్టుల నుంచి నేరుగా హైదరాబాద్‌ (HYDERABAD)లోని సెంట్రల్‌ కార్యాలయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం చేసింది. పన్ను ఎగవేతను పూర్తి స్థాయిలో నిరోధించడం సాధ్యం కాదని కొందరు అధికారులు అంటున్నారు. అయితే, సాధ్యమైనంత మేర అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత తమ మీద వుందని వారు చెబుతున్నారు. అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నామని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అధికారులు అంటున్నారు.

మరోవైపు దశాబ్దాల తరబడి వివాదాల రూపంలో కోర్టుల్లో నలుగుతున్న కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఈ ఏడాది వేల కోట్ల రూపాయలను రాబట్టుకోవాలనేది వాణిజ్య పన్నుల అధికారుల వ్యూహంగా కనిపిస్తోంది. హైకోర్టులో 479 కేసుల్లో ఉన్న రూ.1,960 కోట్లు, సుప్రీంకోర్టులో ఉన్న 34 కేసుల్లోని రూ.574 కోట్లు, అంతర్గత ట్రిబ్యునల్‌ పరిధిలోని 2,505 కేసుల్లో ఉన్న రూ.1,153.51 కోట్లతో పాటు పాతబకాయిలు రూ.130 కోట్లు, 13 ఏళ్ల పాటు బకాయిల వ్యత్యాసం కింద పెండింగ్‌లో ఉన్న రూ.1,907 కోట్లను ఎలాగైనా రాబట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే ఈ పెండింగ్‌ పన్నుల వసూలుకు గాను వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) లేదా ఇతర అందుబాటులో ఉన్న మార్గాలపై వాణిజ్య పన్నుల యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ALSO READ: తెలంగాణలో మరో ఓట్ల పండుగ.. కదనోత్సాహంతో రాజకీయ పార్టీలు