Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఇక నుంచి వీరికి కూడా కరెంట్ ఫ్రీ.. దరఖాస్తు చేస్కోండి
గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకంలో లక్షలాది మంది లబ్ది పొందుతుండగా.. తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. వారికి కూడా పథకాన్ని అమలు చేస్తామన్నారు.

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో తీపికబురు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గృహజ్యోతి పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పేదలకు అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకం క్రింద 52.82 లక్షల మంది లబ్ది పొందుతుండగా.. ఇప్పటివరకు రూ.3,593 కోట్లు వీరి విద్యుత్ బిల్లుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. 200 యూనిట్ల వరకు కరెంట్ వినియోగించేవారికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. అంతకుమించి వాడితే ఈ పథకం వర్తించదు.
వారికి కూడా గృహజ్యోతి పథకం
గృహజ్యోతి పథకం కింద లబ్ది పొందాలంటే బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. దీనికి రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసింది. కొత్తగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు పొందివారు ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. 200 యూనిట్లకు మంచి 10 నుంచి 15 యూనిట్ల ఎక్కువగా వాడితే మొత్తం యూనిట్లకు బిల్లులు వసూలు చేస్తున్నారని, వీరిని గృహజ్యోతి స్కీమ్ నుంచి తొలగిస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. వారికి కూడా పథకం వర్తింపచేయాలని కోరారు. ఈ క్రమంలో భట్టి అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
దరఖాస్తు చేసుకోండి
కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకోవాలి. ఇందుకోసం మున్సిపల్, ఎంపీడీవో ఆఫీసుల్లో ఉండే ప్రజాపాలన అధికారులకు దరఖాస్తులు సమర్పించాలి. దీంతో అధికారులు పరిశీలించి పథకంలో లబ్దిదారుడిగా చేర్చుతారు. దీని వల్ల 200 యూనిట్ల లోపు కరెంట్ వాడితే ఈ పథకం వర్తిస్తుంది.
