Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? దరఖాస్తు పెట్టుకున్నా.. ఎప్పుడు మంజూరు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారా..? ఇలాంటివారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తీపికబురు అందింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కీలక ప్రకటన చేశారు. అదేంటంటే..?

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా చాలామందికి ఇళ్లు మంజూరు కాకపోవడంతో.. ఎప్పుడెస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ముందుగా గ్రామాల్లోని పేదలకు ఇళ్లను మంజూరు చేస్తోండగా.. ఇప్పటికే చాలాచోట్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రభుత్వం లబ్దిదారులకు విడతల వారీగా నిధులు విడుదల చేసింది. నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో వీటిని జమ చేస్తోంది.
నిరంతర ప్రక్రియ
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక విడత ఇళ్ల మంజూరు పూర్తవ్వగా.. మరో మూడు విడతలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో కొత్త ఇళ్ల మంజూరును ప్రకటిస్తున్నామని, తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. 52 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 3 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వచ్చే వర్షాకాలంలోపు తొలి విడత ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. తొలి దశలో గ్రామాల్లోని ప్రజలకు ఇళ్లను మంజూరు చేశామని, రెండో దశలో పట్టణాల్లోని ప్రజలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
స్థలాలను గుర్తిస్తే ఇళ్ల మంజూరు
గ్రామాల్లో స్థలాలను గుర్తించి వాటిని నిరుపేదలకు ఇస్తామని, 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితికి మంచి ఇళ్లు నిర్మించుకున్నవారికి మినహాయింపులు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలామందికి ఇళ్లు మంజూరు చేసినా నిధులు అందలేదని, ఇప్పుడు వారికి కూడా జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింగరేణి ఏరియాల్లో ఇళ్ల పట్టాల మంజూరుకి సంబంధించి కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
