Telangana: ఓరి దేవుడా! కాళ్ల పారాణి ఆరక ముందే విధి ఆడిన వింత నాటకం ఇది..!

నల్లగొండ జిల్లా మేళ్లచెరువు సమీపంలో నవ దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వధువు పరిస్థితి విషమంగా ఉంది.

Telangana: ఓరి దేవుడా! కాళ్ల పారాణి ఆరక ముందే విధి ఆడిన వింత నాటకం ఇది..!
Nalgonda Road Accident
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Dec 03, 2024 | 12:34 PM

మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఒకటయ్యారు. ఎన్నో ఆశలతో నూరేళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లి వేడుక తాలూకు ఆనందకర జ్ఞాపకాల్లో ఇరు కుటుంబాలు మునిగి ఉన్నారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరతామన్న సంతోషం అంతలోనే కనుమరుగైంది. కాళ్ల పారాణి ఆరక ముందే ఆ కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామానికి చెందిన రాచూరి ఉపేందర్‌ (36)కు కొద్దిపాటి వ్యవసాయంతో వరికోత యంత్రం డ్రైవర్‌గానూ పనిచేస్తున్నాడు. ఉపేందర్‌కు మేళ్లచెర్వు మండలం వెల్లటూరుకు చెందిన గండారపు సూర్యనారాయణ చిన్న కూతురు రత్నకుమారితో నవంబర్ 29న (శుక్రవారం) పెళ్లయింది. ఉపేందర్ ఇంటి వద్ద నిద్రలు అయిపోయిన తర్వాత మలుపు నిద్ర కోసం తీసుకొచ్చేందుకు అమ్మాయి కుటుంబసభ్యులు వెల్లటూరుకు వెళ్లారు. ఆదివారం అమావాస్య కావడంతో సోమవారం(డిసెంబర్ 2) సాయంత్రం వధువు ఇంటిలో నిద్ర చేసేందుకు నవ వధువులు తడకమల్ల నుంచి వెల్లటూరుకు బైక్ పై, బంధువులు క వెనుక ఆటోలో బయలుదేరారు.

మరో 10 నిమిషాల్లో వెల్లటూరు ఇంటికి చేరుకుంటారనగా మేళ్లచెరువు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ ఘోర ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ గడ్డి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఉపేందర్‌ ఢీకొట్టాడు. బైక్‌ వేగంగా నడపడం, రాత్రిపూట ఆగివున్న ట్రాక్టర్‌ కనిపించక పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ట్రాలీకి బలంగా తగలడంతో ఉపేందర్‌ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రత్నకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. వెనకనే ఆటోలో వస్తున్న కుటుంబ సభ్యులకు రత్నకుమారి బలమైన గాయాలతో అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా, ఆమె పక్కనే రక్తపు మడుగులో ఉపేందర్‌ విగతజీవిగా కన్పించడంతో బోరున విలపించారు.

తీవ్రగాయాలైన రత్న కుమారిని ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. నవ వధువు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇరు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపడం స్థానికులను కలిచివేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..