AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ ఓటు గల్లంతే..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటు వేసే విధానంపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేప్పుడు తప్పనిసరిగా కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అవేంటంటే..?

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ ఓటు గల్లంతే..!
Rajesh Sharma
|

Updated on: Mar 11, 2021 | 5:55 PM

Share

Graduate Constituency MLC Elections: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్‌కు సమయం దగ్గరవుతోంది. బరిలో భారీ సంఖ్యలో అభ్యర్థులుండడంతో ఓటు వేసే విధానంపై పలువురు గ్రాడ్యుయేట్ ఓటర్లలో అయోమయం నెలకొంది. దానికి తోడు గత 2015 ఎమ్మెల్సీ ఎన్నికల నాటితో పోలిస్తే.. కొత్తగా నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య కూడా భారీగానే వుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా రెండింతలకు పైగా పెరిగారు గ్రాడ్యుయేట్ ఓటర్లు. దానికి తోడు అభ్యర్థుల సంఖ్య మూడింతలు అయింది.

అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలోను ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారు. అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ వుండడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకమవుతాయన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటు వేసే విధానంపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేయలేకపోతే.. కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేప్పుడు తప్పనిసరిగా కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అవేంటంటే..?

# బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. రాజకీయ పార్టీల తరపున వారు పోటీ చేస్తున్నా కూడా… వారి పేర్ల పక్కన పార్టీల సింబల్స్ (గుర్తులు) ముద్రించరు. పార్టీల అభ్యర్థులు గెలిస్తే వారికిచ్చే ధ్రువపత్రంలో వారు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది మాత్రం మెన్షన్ చేస్తారు.

# ప్రాధాన్యత ప్రాతిపదికన ఓట్లు వేయాల్సి ఉంటుంది. తాము ఎవరికైతే ఓటు వేయదలచుకున్నారో వారి పేరు పక్కన ఉన్న బాక్సులో 1 నెంబర్ వేయాలి. టిక్‌ మాత్రం చేయకూడదు. అలాగే ఇతరత్రా మరే పద్ధతిలోనూ ఓటును మార్క్‌ చేసినా అది చెల్లదు. నెంబర్‌ మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాసినా కూడా ఓటు చెల్లదు.

# పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉంటే… ఓటరు అన్ని ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు అంటే ఉదాహరణకు ఈసారి హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి తమ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు… అంటే 1, 2, 3, 4…. ఇలా అభ్యర్థుల పేర్ల పక్కన తాము వారికిచ్చే ప్రాధాన్యతను నెంబర్ రూపంలో వేయవచ్చు. అలా 93 వరకు ప్రాధాన్యతలు ఇచ్చే వీలుంది.

# మొదటి ప్రాధాన్యత (నంబర్‌ 1) ఇవ్వకుండా… మీరెన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా ఆ ఓటు చెల్లదు.

# ఒక్కరికే తొలి ప్రాధాన్యత ఓటు వేసి ఆపేయవచ్చు లేదా తాము ఎన్ని అనుకుంటే అన్ని పాధాన్యత ఓట్లు వేసి ఆపేయవ చ్చు. అయితే ప్రాధ్యానతను ఇచ్చే క్రమంలో వరుస తప్పకూడదు. ఉదాహరణకు మొదటి ప్రాధాన్యతకు 1 ఇచ్చి తర్వాత క్రమం తప్పి 3, 4, 5 వేస్తూ పోయారనుకోండి… అప్పుడు ద్వితీయ ప్రాధాన్య త ఓట్లను లెక్కించాల్సిన అవసరం వస్తే మీ ఓటు చెల్లదు. మొదటి ప్రాధాన్యత వరకే మీ ఓటును పరిగణనలోని తీసుకొని ఆ తర్వాత పక్కన పడేస్తారు.

# ఒకే నంబరును ఇద్దరు అభ్యర్థులకు ఇచ్చినా ఓటు చెల్లకుండా పోతుంది.

# బ్యాలెట్‌ పేపరుపై అంకెలు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌లో ఇచ్చే స్కెచ్‌ పెన్‌నే వాడాలి.

# బ్యాలెట్‌ పేపర్‌పై పేర్లు రాయడం, సంతకం చేయడం, వేలిముద్ర వేయడం… చేయకూడదు. అంకెలతో ఓటు ను మార్క్‌ చేయడం తప్పితే బ్యాలెట్‌పై ఏం రాసినా దాన్ని చెల్లని ఓటుగా భావించి పక్కన పెడతారు.

# విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రదేశాల్లో ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. దీనికి నిర్ణీత విధానాన్ని ఫాలో కావాల్సి వుంటుంది. అధీకృత అధికారి అటెస్టేషన్‌ అవసరం

విజేతను తేల్చేందుకు ఓ ఫార్ములా

# ఓట్ల లెక్కిపు తర్వాత గెలిచిన వారెవరో తేల్చడానికి ఒక నిర్దిష్టమైన ఫార్ములాను ఫాలో అవుతారు. అయితే టెక్నికల్‌గా కాకుండా స్థూలంగా చెప్పాలంటే… పోలైన వాటిలో చెల్లుబాట్లయ్యే ఓట్లలో 50 శాతం + ఒక ఓటు రావాలి. ఉదాహరణకు 3,60,020 ఓట్లు చెల్లుబాటు అయ్యాయనుకోండి… అందులో సగం 1,80,010 ఓట్లు + 1 రావాలి. కనీసం 1,80,011 మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే రెండో ప్రాధాన్యత ఓట్లను చూడకుండానే విజేతను ప్రకటిస్తారు.

# అభ్యర్థులెవరికీ నిర్ణీత తొలి ప్రాధాన్యత ఓట్లు రాకపోతే… అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం అవుతాయి.

# బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ముందు పోటీ నుంచి తప్పిస్తారు. అతనికి పడ్డ ఒక్కో ఓటును తీసి… అందులో ద్వితీయ ప్రాధాన్యత (నెంబరు 2) ఎవరికి ఉంటే వారికి ఆ ఓటును కలుపుతారు. ఒకవేళ సమాన ఓట్లతో ఆఖరిస్థానంలో ఇద్దరు ఉన్నారనుకోండి… అప్పుడు ఎవరిని ముందు ఎలిమినేట్‌ చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు.

# ఇలా అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ మొదలవుతుంది. చివరి అభ్యర్థి తర్వాత… అతని పైస్థానంలో ఉండే అభ్యర్థి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కింపునకు తీసుకుంటారు. అంటే కింది నుంచి క్రమంగా పైకి వెళతారు.

# మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్‌ మార్క్‌కు సమీప దూరంలో నిలిచిపోయిన అభ్యర్థులకు (అత్యధిక ఓట్లు పొందిన తొలి ఇద్దరు– ముగ్గురు అభ్యర్థులు) ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల బదలాయింపు జరిగితే వారి ఓట్ల సంఖ్య పెరుగుతుంది. అలా విజయానికి చేరువవుతారు. ఎవరైనా ఒకరికి నిర్ణీత ఓట్లు (50 శాతం + ఒక ఓటు) వచ్చే దాకా ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది (ఒకరు నిర్ణీత ఓట్లను సాధించిన వెంటనే కౌంటింగ్‌ ప్రక్రియను నిలిపివేయరు. ఆ రౌండ్‌లో ఎలిమినేట్‌ అవుతున్న అభ్యర్థికి సంబంధించిన మొత్తం ఓట్ల లెక్కింపును పూర్తిచేసి కౌంటింగ్‌ను నిలిపివేస్తారు). రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా కలుపుకొని మ్యాజిక్‌ మార్క్‌కు చేరుకున్న వారిని విజేతగా ప్రకటిస్తారు.

ALSO READ: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. ఓవైపు సైన్యం..మరోవైపు విపక్షం.. తప్పుకోవడం తప్పదేమో?

ALSO READ: దాడుల తర్వాత కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం.. సానుభూతి వర్కౌట్ అయ్యేనా?

Follow Us