Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy Land grab Issue: రికార్డులు తారుమారు.. డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్

రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డిని..

Revanth Reddy Land grab Issue: రికార్డులు తారుమారు.. డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 26, 2020 | 9:27 PM

Revanth Reddy Land Issue: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూ లావాదేవీల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. భూముల కొనుగోల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ యాక్షన్‌ తీసుకుంది. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంతకూ తప్పుడు పత్రాలతోనే రేవంత్ బ్రదర్స్ ఆ భూములను కొనుగోలు చేశారా..? దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ తన నివేదికలో ఏం తేల్చారు…? అసలు ఆ భూమి చుట్టూ వివాదం ఎందుకు నడుస్తోంది?

గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ గోపనపల్లి ఏరియాలోనివి. మార్కెట్ పరంగా మాంఛి డిమాండ్ ఉన్న భూములివి. సర్వే నంబర్‌ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటలు రేవంత్‌రెడ్డి అక్రమ మార్గంలో కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, రేవంత్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కొల్లా అరుణ అనే మహిళ 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ భూములపై వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈమేరకు సీఎస్‌కు ఓ నివేదిక సమర్పించారు. తప్పుడు పత్రాలతో తొలుత వేరే వారి పేరు మీద భూమి రాయించి, ఆ తర్వాత వారి నుంచి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారని సమాచారం. అక్రమ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని అక్రమంగా మ్యుటేషన్‌ చేసారని.. అప్పటి డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాసరెడ్డి ఇందుకు సహకరించారని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపధ్యంలో డిప్యూటీ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటుపడింది.

ఇప్పటికీ సర్వే నంబర్‌ 127లో గల భూమికి హక్కు దారులెవరన్నదానిపై స్పష్టత లేదని.. తప్పుడు డాక్యుమెంట్ల ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేశారని కలెక్టర్‌ తన నివేదికలో పేర్కొన్నారు. పది ఎకరాలకు పైగా భూముల ఆక్రమణకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భూముల కొనుగోళ్లకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ వివాదంలో మరో ఇద్దరు తహశీల్దార్ల పాత్ర కూడా గుర్తించామని, తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని..రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు.