
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి గురుకుల విద్యార్థులతో పాటు అన్ని ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లకు 22 రకాల అవసరమైన వస్తువులు అందించాలని నిర్ణయించింది. ఈ వస్తువుల సరఫరా సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యేలోపు పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదని, అయితే నాణ్యత విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు. సోమవారం ఎడ్యుకేషన్, వెల్ఫేర్ శాఖల ఉన్నతాధికారులతో సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
యూనిఫామ్‌తో పాటు మొత్తం 22 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్‌బుక్స్ సహా ఇతర అవసరమైన వస్తువుల సరఫరాకు సంబంధించి స్పష్టమైన ప్రొక్యూర్మెంట్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని సీఎం తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు వేగంగా, బాధ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా తయారు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ ప్రగతిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్న భట్టి, నిర్మాణ బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. టెండర్లు పూర్తైన చోట భూమి పూజ నిర్వహించి, భవనాల నిర్మాణానికి స్పష్టమైన గడువు నిర్ణయించాలని తెలిపారు. కలెక్టర్లు ప్రతివారం స్కూళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేయాలని, నెలలో కనీసం ఒకసారి నిర్మాణ ప్రదేశానికి వెళ్లి అక్కడే సమీక్ష నిర్వహించాలని సూచించారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. నిర్మాణాల్లో నాణ్యతను పర్యవేక్షించేందుకు థర్డ్ పార్టీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల పురోగతిపై వారానికి ఒకసారి కలెక్టర్ల నుంచి చీఫ్ సెక్రటరీ నివేదిక తీసుకోవాలన్నారు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..