Telangana: పేదలకు గుడ్‌న్యూస్.. ఉచితంగానే సన్నబియ్యం పంపిణీ.. ఎప్పటి నుంచంటే?

ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం ధరలు షాక్‌కు గురిచేస్తున్నాయి. మార్కెట్లో రోజురోజుకూ బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నడూలేని విధంగా బియ్యం రేట్లు పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తుంది. పెరిగిన బియ్యం రేట్లతో పేద, మధ్య తరగతి కుటుంబాలు బుక్కెడు మొతుకులు తినే పరిస్థితి కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telangana: పేదలకు గుడ్‌న్యూస్..  ఉచితంగానే సన్నబియ్యం పంపిణీ.. ఎప్పటి నుంచంటే?
Ration Shop

Updated on: Feb 25, 2025 | 5:19 PM

తెలంగాణలో పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పేదలకు దగ్గర అయ్యేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే సన్న బియ్యం పండించేందుకు రైతులను ప్రోత్సహించిన ప్రభుత్వం, 500 రూపాయల బోనస్ సైతం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్నబియ్యాన్ని ఎక్కువగా సాగు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే సన్న బియాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నబియ్యాన్ని నిరుపేదలకు ఉచితంా అందించేందుకు రెడీ అవుతోంది.

వచ్చే ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పేదలు రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని చాలామంది తీసుకుంటున్నప్పటికీ వాటిని వండుకుని తినే పరిస్థితి లేదు. దొడ్డు బియ్యం తీసుకువెళ్లి, వాటిని తిరిగి షాపుల్లో ఇచ్చేసి సన్నబియ్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు పేదలు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యాన్ని నిరుపేదలకు రేషన్ షాప్ ల ద్వారా అందించేందుకు రెఢీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సన్నబియ్యాన్ని సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం ధరలు షాక్‌కు గురిచేస్తున్నాయి. మార్కెట్లో రోజురోజుకూ బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నడూలేని విధంగా బియ్యం రేట్లు పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తుంది. పెరిగిన బియ్యం రేట్లతో పేద, మధ్య తరగతి కుటుంబాలు బుక్కెడు మొతుకులు తినే పరిస్థితి కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 53.95 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించగా.. ప్రస్తుతం అక్కడ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ జరుగుతోంది. గతంలో కంటే ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు అధిక పరిమాణంలో వచ్చింది. సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వ చేసిన పౌరసరఫరాల అధికారులు వాటిని విడివిడిగా మిల్లింగ్‌ చేయిస్తున్నారు. సన్న, దొడ్డు రకం వడ్లను వేర్వేరుగా మిల్లింగ్‌ చేయడం ఇదే మొదటిసారి అని సివిల్ సఫ్లై అధికారులు చెబుతున్నారు. మిల్లింగ్‌లో సన్న ధాన్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది.

ఇక ఇప్పటికే ధాన్యం సీఎంఆర్‌ ప్రక్రయ ఫిబ్రవరి 20 వరకు 22 శాతం పూర్తయ్యింది. మెుత్తం 7.90 లక్షల టన్నుల బియ్యం రాగా.. ఇందులో 5.37 లక్షల టన్నుల బియ్యం సన్న రకంగా అధికారులు గుర్తించారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అదే జరిగితే పేదలు డబ్బులు పెట్టి బయట సన్నబియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండదంటున్నారు అధికారులు.

ఇదిలావుంటే, తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో లేని జిల్లాల్లో మొదట కార్డులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిశాక మిగతా జిల్లాల్లో పంపణీ చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డుల డిజైన్లను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..