Hyderabad: వారికి బాసటగా GHMC.. 3 పూటలా ఉచిత భోజనంతో పాటు షెల్టర్ కూడా..
రాజధాని హైదరాబాద్‌పై చలికాలం గట్టిగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ టెంపరేచర్స్ బాగా తగ్గిపోవడంతో.. నగర జీవనం స్తబ్దుగా మారింది. ఇళ్లలో ఉన్నవారికే చలి తట్టుకోలేని స్థితి. అయితే గూటి లేని నిరాశ్రయుల పరిస్థితి మాటల్లో వర్ణించలేం. అలాంటివారికి షెల్టర్ కల్పించేందుకు జీహెచ్ఎంసీ ముందుకొచ్చింది.

తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజధాని హైదరాబాద్‌పై చలి పంజా విసురుతుంది. పొద్దున్న 10 దాటినా చలి తగ్గడం లేదు. ఇళ్లలో ఉన్నవారికే చలి తట్టుకోలేని స్థితి. ఇక గూడు లేని నిరాశ్రయుల పరిస్థితి వర్ణించగలమా. బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు, ప్లైఓవర్స్ కింద గడిపే వారికి రాత్రి నరకయాతనే ఉంటుంది. అలాంటి వారి కోసం కొందరు అక్కడక్కడా మందపాటి దుప్పట్లను పంపిణీ చేస్తున్నారు. అయితే ఎముకలు కొరికే చలిలో అది కొద్దిపాటి ఉపశమనమే. దీంతో నిరాశ్రయులకు బాసటగా నిలిచేందుకు GHMC కీలక నిర్ణయం తీసుకుంది. చలి తాకిడిని ఎదుర్కోలేక కష్టాల్లో ఉన్న నిరాశ్రయుల కోసం షెల్టర్ హోమ్స్‌లో ఆశ్రయం కల్పించేందుకు సిద్దమైంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం పది ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించే షెల్టర్ హోమ్‌లు నడుస్తున్నాయి. ఇక్కడ ఉచితంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి అన్నం, అలాగే ఉచిత వసతి లభిస్తుంది. రోడ్ల మీద తిరుగుతున్న వారిని బల్దియా ప్రత్యేక బృందాలు గుర్తించి ఈ కేంద్రాలకు తీసుకువెళ్తున్నాయి. వారు మాత్రమే కాకుండా.. కొద్ది రోజులు పనిమీద నగరానికి వచ్చినవారు, ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నవారు, మానసిక సమస్యలతో రోడ్లపై తిరుగుతున్నవారికి కూడా ఈ షెల్టర్ హోమ్స్ తాత్కాలిక ఆవాసాలుగా ఉన్నాయి. కాగా గోల్నాక, ఉప్పల్, సరూర్‌నగర్ ప్రాంతాల్లోని షెల్టర్ హోమ్‌లు మాత్రం పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. మిగతా కేంద్రాలు పురుషులకు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 269 మంది ఉన్నప్పటికీ ప్రస్తుతం సుమారు 164 మంది మాత్రమే ఉంటున్నారు. బేగంపేటలో ఉన్న కేంద్రాన్ని GHMC రికవరీ సెంటర్‌గా మార్చింది. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ముందు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత ఇక్కడ కొంతకాలం పర్యవేక్షణలో ఉంటారు. ఆరోగ్యంగా మారిన తర్వాత ఇతర షెల్టర్లకు తరలించడమో… లేక వారి కుటుంబాలను గుర్తిస్తే వారి వద్దకు పంపడమో చేస్తారు.
ఈ పది కేంద్రాల్లో ఎనిమిది ఎన్జీవోలు భాగస్వామ్యంతో నడుస్తున్నాయి. GHMC ఆయా సంస్థలతో MoUలు చేసుకుని, ఒక్కో షెల్టర్ హోమ్ నిర్వహణకు నెలకు రూ. 23,333 ఖర్చు చేస్తోంది. తగిన సిబ్బందితో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. గరిష్ఠంగా ఆరు నెలల వరకు ఇక్కడ నివసించేందుకు అనుమతి ఉంటుంది. పేట్లబురుజు, ఉప్పల్, శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ, టప్పాచబుత్రా , గోల్నాక, యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి బేగంపేట్ ఫ్లైఓవర్ సమీపంలో 3 చోట్ల ప్రస్తుతం షెల్టర్ హోమ్స్ నడుస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
