Bhadrachalam: భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూల పంపిణీ.. భక్తుల తీవ్ర ఆగ్రహం

|

Jan 08, 2023 | 12:41 PM

భద్రాచలం రామాలయంలో భక్తులకు పంపిణీ చేసే లడ్డూలు బూజు పట్టడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముక్కోటి సందర్భంగా భక్తులకు అందించేందుకు సుమారు రెండు లక్షల లడ్డూల తయారు చేశారు. అయితే భక్తులకు పంపిణీ చేయగా మిగిలిపోయిన లడ్డూలను భద్రపరచడంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Bhadrachalam: భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూల పంపిణీ.. భక్తుల తీవ్ర ఆగ్రహం
Laddoos
Follow us on

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకోవడానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అలాగే ఇక్కడి లడ్డూలను మహా ప్రసాదంగా భావించి మరీ తీసుకుంటారు. వ్యయ ప్రయాసాలకు ఓర్చి క్యూలైన్లలో నిల్చోని లడ్డూలు కొనుగోలు చేస్తారు. అయితే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన రాములోరి లడ్డూ ప్రసాదం నాణ్యత డొల్లగా మారింది. భద్రాచలం రామాలయంలో భక్తులకు పంపిణీ చేసే లడ్డూలు బూజు పట్టడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులకు అందించేందుకు సుమారు రెండు లక్షల లడ్డూల తయారు చేశారు. అయితే భక్తులకు పంపిణీ చేయగా మిగిలిపోయిన లడ్డూలను భద్రపరచడంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాటికి ఫంగస్‌, బూజు పట్టాయి. అయితే వాటిని పక్కన పెట్టకుండా అలాగే లడ్డూ కౌంటర్‌లో పెట్టి విక్రయిస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇచ్చట బూజు పట్టిన లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తున్నారు’ అంటూ నోటీసు అంటించడం తీవ్ర కలకలం రేపింది. కాగా తయారు చేసిన లడ్డూలను గాలికి ఆరబెట్టడం, లేదా చల్లని ప్రదేశాల్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

అయితే దేవస్థానం అధికారులు ఇష్టానుసారం లడ్డూలను పంపడం, కౌంటర్లలో వేడివాతావరణం మధ్య అలాగే వదిలేస్తుండటంతో తొందరగా బూజు వచ్చి పాడవుతున్నాయి. అలాగే ఏ మాత్రం అంచనాలు లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో లడ్డూలు తయారు చేయించడం, స్టాక్‌ ఉంచడంతో అవి బూజు పట్టి వృథా అవుతున్నాయని భక్తులు తెగ మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..