AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ.. సర్కార్ భరోసా ఇస్తున్నా.. తప్పని తిప్పలు!

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఇంధన సంక్షోభం, ప్రభుత్వ ప్రకటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులు గందరగోళానికి గురి చేస్తున్నాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరా అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటే, మరోవైపు సామాన్య వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ.. సర్కార్ భరోసా ఇస్తున్నా.. తప్పని తిప్పలు!
Fuel Station
Balaraju Goud
|

Updated on: Apr 29, 2026 | 10:15 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఇంధన సంక్షోభం, ప్రభుత్వ ప్రకటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులు గందరగోళానికి గురి చేస్తున్నాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరా అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటే, మరోవైపు సామాన్య వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది.

పౌర సరఫరాల శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఇంధన సరఫరాను సాధారణం కంటే 126% పెంచారు. ఏప్రిల్ 27 నాటికి డీజిల్ పంపిణీ 151%, పెట్రోల్ పంపిణీ 95% పెరిగినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 3,100 ట్యాంకర్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇంధనాన్ని బంకులకు చేరుస్తున్నారు. ప్రతి మూడు గంటలకోసారి నిల్వలపై సమీక్ష నిర్వహిస్తూ, రైతులకు ముఖ్యంగా కోతల సమయంలో ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో డీజిల్ నిల్వలను 46%, పెట్రోల్ నిల్వలను 40% మేర పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.

సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలు తెలంగాణ సరిహద్దు బంకులకు క్యూ కట్టడం ఒక కారణమైతే, పరిశ్రమల డీజిల్ ధర ₹150 కు పెరగడంతో బల్క్ కన్స్యూమర్స్ అందరూ సాధారణ రిటైల్ బంకులపై పడటంతో డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. అలాగే, ధరలు పెరుగుతాయనే పుకార్ల వల్ల జనం అవసరానికి మించి నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఉన్నా, గ్రౌండ్ రియాలిటీలో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఇల్లందు వంటి ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా ఉంది. అనేక బంకులు ‘నో స్టాక్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అరగంట నుండి గంట వేచి చూస్తే తప్ప ఇంధనం దొరకని పరిస్థితి. డాలర్ రేటు పెరగడంతో ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి సరఫరాను కావాలనే తగ్గించాయని డీలర్ల అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 42,000 బంకుల్లో దాదాపు 30% బంకులు స్టాక్ లేక మూతపడ్డాయని సమాచారం.

ప్రభుత్వం పుకార్లను నమ్మవద్దని కోరుతున్నప్పటికీ, బంకుల వద్ద బోర్డులు, క్యూలు చూస్తుంటే ప్రజల్లో ఆందోళన తగ్గడం లేదు. సరఫరా, డిమాండ్ మధ్య ఉన్న ఈ అంతరాన్ని ప్రభుత్వం తక్షణమే పూడ్చాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us