Telangana: 10 బంగారు బిస్కెట్లు రూ. 18 లక్షలే.! లచ్చలు లచ్చలు పోశారు.. సీన్ కట్ చేస్తే
సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు నింగి నంటూతున్నాయి. కేటుగాళ్ళు మాత్రం ఇదే మంచి అవకాశంగా నకిలీ బంగారంతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ ధరకు అసలైన బంగారం ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ నకిలీ బంగారం అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి మోసం చేస్తున్న ముఠాకు సూర్యాపేట పోలీసులు చెక్ పెట్టారు.

ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన నాగేశ్వరరావు జల్సాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. దీంతో ఈజీ మనీ కోసం నరసరావుపేటకు చెందిన బాల, మేడి ఆదినారాయణ, ప్రకాశం జిల్లా పెద్ద ఆరవీడు మండలానికి చెందిన కుందూరు యోగిరెడ్డి, పిట్ట నాగేంద్రరెడ్డి, రాజులపాడుకు. చెందిన చంద్ర, గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రావు, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన ఇర్రి నరేశ్, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన సుధాకర్ మొత్తం తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి ఏర్పడ్డారు. అమాయకులే టార్గెట్‌గా ఈ ముఠా నకిలీ బంగారాన్ని అసలైన బంగారు బిస్కెట్లు అంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చిన డబ్బులో 10 శాతం కమిషన్ ఇస్తానని ప్రధాన నిందితుడు నాగేశ్వరావు ముఠా సభ్యులకు చెప్పాడు.
ఈ క్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన ముఠా సభ్యుడు నరేష్‌కు హనుమకొండకు చెందిన వెంకటేశ్వరరావు, లీలాతో పరిచయం ఏర్పడింది. తమ వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నాయని, తులం 90 వేల రూపాయలకే ఇస్తామని వారికి చెప్పాడు. దీంతో వెంకటేశ్వర రావు, లీలా సూర్యాపేట సమీపంలోని హోటల్ సెవెన్ వద్దకు వచ్చి రూ.18 లక్షలకు 20 గ్రాముల పది బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. అదే రోజు నాగేశ్వరరావు సూర్యాపేటలోని బాలెంలోని అద్దె ఇంటికి వచ్చి రూ. 12 లక్షలు చెల్లించి, ఐదు బిస్కెట్లను తీసుకొని వెళ్లారు. మిగిలిన డబ్బు చెల్లించిన తర్వాత మరో ఐదు బిస్కెట్లు ఇవ్వనున్నట్లు ప్రధాన నిందితుడు నాగేశ్వరావు చెప్పారు.
బాధితులు ఇచ్చిన డబ్బును పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నాగేశ్వరరావు తాత్కాలికంగా నరేశ్ వద్ద ఉంచాడు. కొద్దిరోజుల తర్వాత మిగిలిన డబ్బులను తీసుకొని సూర్యాపేటకు వస్తున్నట్లు బాధితులు వెంకటేశ్వర రావు, లీలా.. నిందితుడు నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. అయితే డబ్బును బాలెం సమీపన ఉన్న వంతెన వద్దకు తీసుకురావాలని చెప్పాడు. అలాగే నరేష్ వద్ద ఉంచిన డబ్బును కూడా తీసుకొని రావాలని సూచించారు. నిందితులు, బాధితులు వంతెన వద్దకు చేరుకున్నారు. పక్కా సమాచారంతో సూర్యాపేట రూరల్ పోలీసులు దాడి చేశారు. నలుగురు నిందితులు, ఐదు నకిలీ బిస్కెట్లు, రూ.12లక్షలు పట్టుబడ్డాయనీ జిల్లా ఎస్పీ నరసింహ చెప్పారు. పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.
