Car Accident: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి బావిలో పడ్డ కారు.. ఏడుగురు ప్రయాణీకుల్లో నలుగురు మృతి
కేసముద్రం శివారులోని బైపాస్ రోడ్‌లో జరిగింది ఈ ఘటన. బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందినవారు. పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన ఇది. అదుపు తప్పి ప్రమాదవశాత్తూ ఓ కారు బావిలో పడింది. ఏడుగురు ప్రయాణికుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. కేసముద్రం శివారులోని బైపాస్ రోడ్‌లో జరిగింది ఈ ఘటన. బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందినవారు. పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో ఓ ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. ప్రమాదానికి గురైన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మిగిలిన ఇద్దరూ వారికి తెలిసినవారని, లిఫ్ట్ అడిగితే ఇచ్చామని ప్రమాదం నుంచి బయటపడిన వారు చెప్పారు. చీకటిగా ఉండడంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో భద్రు, బిక్కు, అచ్చాలి, సుమలత, దీక్షిత అనే ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు, మరో ఇద్దరు వున్నారు. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.. మరోఇద్దరు కారుతో సహా బావిలో మునిగిపోయారు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కేసముద్రం పోలీసులు… బావిలో పడ్డ వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
బాధితుల్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఘటన ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారు పోలీసులు. రహదారుల పక్కన పొంచి ఉన్న బావుల పట్ల అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కనీసంహెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయంటున్నారు స్థానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
