Fish Curry Politics: తెలంగాణ రాజకీయాలను ఘాటెక్కిస్తున్న చేపల పులుసు.. మామూలు జగడం కాదుగా..

చేపల పులుసు.. మాంసాహార ప్రియులకు ఇష్టమైన వంటకం. అదే రాజకీయ నేతలకు ఓ కౌంటర్ పాయింట్‌. ప్రత్యర్థి నేతల్ని టార్గెట్ చేయాలన్నా.. ఇరుకున పడేయాలన్నా చేపల పులుసును ఆయుధంగా మలుచుకుంటుంటారు. తెలంగాణ గట్టుపై ఇప్పుడిదే జరుగుతోంది. జల జగడం నుంచి మొదలైన రాజకీయం.. చేపల పులుసు వైపు టర్న్‌ అయి కుతకుతలాడిస్తోంది.

Fish Curry Politics: తెలంగాణ రాజకీయాలను ఘాటెక్కిస్తున్న చేపల పులుసు.. మామూలు జగడం కాదుగా..
Harish Rao - CM Revanth Reddy

Updated on: Mar 11, 2025 | 7:43 AM

2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జల జగడం 2.O మొదలైంది. మా రాష్ట్రం సంగతేంటని తెలంగాణ నిలదీయడంతో కొత్తగా గైడ్‌లైన్స్ రాసుకోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాలకూ నీటి కేటాయింపులు జరగాలని.. రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఛైర్మన్‌గా.. ఓ ఎపెక్స్ కమిటీని వేయాలని ప్రతిపాదించింది విభజన చట్టం. ఆ సంగతి కాస్త పక్కనపెడితే.. ఇప్పటికీ నీళ్ల వాటాల విషయంలో నేతల మాటలతో జలవివాదం జటిలమవుతూనే ఉంది. సీఎం రేవంత్‌ – మాజీమంత్రి హరీష్‌ రావు మధ్య ప్రాజెక్ట్‌ల సెంట్రిక్‌గా మాటల యుద్ధం పీక్స్‌కి వెళ్తూనే ఉంది. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలన సక్రమంగా చేసి ఉంటే ఇప్పుడీ కష్టాలు ఉండేవి కావన్నారు సీఎం రేవంత్‌. ఈ కామెంట్లపై స్పందించిన హరీష్‌ రావు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ కౌంటర్ ఇచ్చారు.

పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌, జగన్‌ కలిసి గతంలో నాటకాలు ఆడారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నగరిలో రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్‌.. ఆమె పెట్టిన చేపల పులుసు, రాగి సంకటి తిని రాయలసీమను రతనాల సీమను చేస్తానని కేసీఆర్‌ అనలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్‌ రెడ్డి..

అయితే.. ముఖ్యమంత్రి రేవంత్‌ రూట్‌లోనే వెళ్తున్నారు హరీష్‌రావు. అదే చేపల పులుసును ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. కృష్ణానదిలో ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే… ప్రజాభవన్‌కు సీఎం చంద్రబాబును పిలిచి ఆయన అడుగులకి మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు హరీష్‌. మరోవైపు మంత్రి ఉత్తమ్ దంపతులు కుటుంబ సమేతంగా చంద్రబాబు ఇంటికెళ్లి చేపల పులుసు తిన్నది నిజం కాదా అన్నారు.

సందర్భం ఏదైనా నేతల నోట మళ్లీ మళ్లీ చేపల పులుసు ఘాటెక్కిస్తూనే ఉంది. ఈ ఘాటు ఎక్కడిదాకా వెళ్తుంది..? ఎవరి నషాళానికెక్కిస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..