అనుమతి లేకుండా నిర్మాణాలు.. నోటీసులపై స్పందించిన సినీనటుడు అలీ.. ఏమన్నారంటే?
నిర్మాణాలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు ఫోన్ చేసినా అలీ స్పందించేవారు కాదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని విమర్శలు ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్మామిడి గ్రామంలోని సినీ నటులు అలీ ఫామ్‌హౌజ్‌లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు. దీంతో ఎక్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులిచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 345లో ఉన్న దాదాపు 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు అలీ. ఆ భూమిలో అలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీల సహాయంతో పంటలు, పండ్ల తోటలు కూడా వేశారు.
అయితే ఈ మధ్య వ్యవసాయ క్షేత్రంలో అలీ పలు నిర్మాణాలు చేపట్టారు. అదీ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో అలీపై స్థానికులు పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీకి నోటీసులిచ్చారు.
అలీ తీరుపై ఎక్మామిడి గ్రామ మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సర్పంచ్‌గా ఉన్నప్పుడు నిర్మాణాలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు ఫోన్ చేసినా అలీ స్పందించేవారు కాదన్నారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన అలీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, గ్రామ పంచాయతీ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం భూమిని లీజుకు ఇచ్చానని తెలిపారు. ఫార్మ్ ల్యాండ్‌లో కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని తెలిపారు. నోటీసులపై స్పందించాల్సింది లీజుదారులే అని తేల్చి చెప్పారు. మరోవైపు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..