Telangana: ఊట నీటి గుంతలో వింత చప్పుళ్లు.. ఏంటా అని కెమెరాకు పని చెప్పగా.. అయ్యబాబోయ్.!
సాధారణంగా దర్శనమివ్వని దృశ్యం అది. నీటిలో బలమైన జీవుల్లో ఒకటి... ఇక ఆ జాతిలో పొడవైన, బరువైన బలమైన జీవి మరొకటి. ఈ రెండు కలబడినట్లు కనిపిస్తే...ఇంకేముంటుంది నరాలు తెగిపోయే సీన్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామంలోని ఓ నీటి గుంతలో చోటు చేసుకున్న మొసలి, కొండచిలువ మధ్య పోరాటం ఉలిక్కిపాటుకు గురిచేసింది.

మక్తల్ మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో మొసలి, కొండచిలువల మధ్య ఫైట్ కలకలం రేపింది. స్థానిక ప్రభుత్వ పాఠశాల వెనుకాల ఉన్న ఓ గుంతలో మొసలి నోటికి భారీ కొండచిలువ చిక్కింది. ఎటు కదలనివ్వకుండా నోటిలోని పళ్ళతో పట్టు పట్టింది. దీంతో మొసలి నోటి నుంచి తప్పించుకునేందుకు కొండచిలువ అష్టకష్టాలు పడుతోంది. ఈ క్రమంలో గుంతలో ఏదో చప్పుడు వినిపిస్తోందని అటుగా వెళ్తున్న కొంతమంది స్థానికులు, పాఠశాల విద్యార్థులు వెళ్లి చూశారు. సీన్ చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మొసలి ని చూస్తేనే భయం అందులో పాముల్లోనే పెద్ద పాము కొండచిలువ రెండు ఒకేసారి దర్శనమివ్వడంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు.
ఇక స్థానికులు కొంతమంది రెండింటిని విడిపించేందుకు ప్రయత్నాలు చేశారు. కాసేపటి తర్వాత గుంత చుట్టు గ్రామస్థలంతా గుమిగూడడంతో మొసలి కొండచిలువను వదిలేసింది. వెంటనే కొండచిలువ అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత మెల్లిగా మకరం సైతం అక్కడి నుంచి మాయమైంది. ఇక రెండింటిని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక తాజా ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రిజర్వాయర్ దిగువన గ్రామం ఉండడంతో తరచూ పాములు, తేళ్లు, మొసళ్లు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నీటి ఊటలు ఏర్పడి గుంతలుగా మారడం, అక్కడ విషసర్పాలు, మొసళ్లు ఆశ్రయం పొందుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు.




