AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND U19 vs PAK U19: గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా..దుమ్ములేపుతున్న టీమిండియా

IND U19 vs PAK U19: క్రికెట్‌లో నమ్మకమే అతిపెద్ద బలం అంటారు. భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రేకు తన స్నేహితుడు, ఓపెనింగ్ భాగస్వామి అయిన వైభవ్ సూర్యవంశీపై అంత నమ్మకం ఉంది. అందుకే వైభవ్ మాకు మ్యాచ్ గెలిపిస్తాడు అని చెప్పడానికి ఆయన ఏమాత్రం వెనుకాడలేదు.

IND U19 vs PAK U19: గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా..దుమ్ములేపుతున్న టీమిండియా
Vaibhav Suryavanshi (3)
Rakesh
|

Updated on: Dec 14, 2025 | 11:38 AM

Share

IND U19 vs PAK U19: క్రికెట్‌లో నమ్మకమే అతిపెద్ద బలం అంటారు. భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రేకు తన స్నేహితుడు, ఓపెనింగ్ భాగస్వామి అయిన వైభవ్ సూర్యవంశీపై అంత నమ్మకం ఉంది. అందుకే వైభవ్ మాకు మ్యాచ్ గెలిపిస్తాడు అని చెప్పడానికి ఆయన ఏమాత్రం వెనుకాడలేదు. పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు ఆయుష్ మ్హాత్రే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ బలం, అతని సామర్థ్యం గురించి వివరించారు. ఈ మాటల ద్వారా ఈసారి వైభవ్ వెనక్కి తగ్గడని పాకిస్తాన్ అండర్-19 జట్టుకు ఆయన ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపుతున్నట్లు అనిపిస్తోంది.

అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ, పాకిస్తాన్ జట్టు ముఖాముఖి తలపడటం ఇది రెండోసారి. వారిద్దరి మధ్య మొదటి పోరు గత అండర్-19 ఆసియా కప్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 8 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌తోనే వైభవ్ అండర్-19 వన్డేలలో తన అరంగేట్రం చేశాడు.

అయితే, ఈసారి పాకిస్తాన్‌ను ఎదుర్కోబోయే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన ఆటగాడు కాదు, అనుభవం ఉన్న ఆటగాడిగా మారాడు. ఈ ఏడాది సెంచరీల దాహం తీర్చుకోని బ్యాటర్ అతను. వైభవ్ కేవలం అండర్-19 వన్డే జట్టుకే ఇప్పటివరకు 3 సెంచరీలు కొట్టాడు. అంతేకాకుండా ఐపీఎల్, అండర్-19 టెస్ట్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఇండియా ఎ తరఫున కూడా సెంచరీలు సాధించాడు.

ఇలాంటి అద్భుతమైన రికార్డు ఉన్న ఆటగాడిపై కెప్టెన్‌కు పూర్తి ఆత్మవిశ్వాసం ఉండటం సహజమే. అదే నమ్మకంతో ఆయుష్ మ్హాత్రే మాట్లాడుతూ, “వైభవ్ ఎలాంటి ఆటగాడో చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఆడితే జట్టు ఏకపక్షంగా గెలుస్తుంది” అని స్పష్టం చేశాడు.

వైభవ్ మ్యాచ్ గెలిపిస్తాడని గట్టిగా చెప్పడానికి గల కారణాన్ని కూడా కెప్టెన్ వివరించాడు. “ప్రస్తుతం వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇది మా జట్టుకు చాలా మంచి విషయం. అతను గత ఏడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు. మేము ఒక సంవత్సరం నుంచి కలిసి ఆడుతున్నాం. అతని ఆటను చూస్తున్నాం. కాబట్టి, వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తాడని, జట్టు తప్పకుండా గెలుస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది” అని ఆయుష్ మ్హాత్రే తెలిపారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వైభవ్ ఎలా సిద్ధమయ్యాడని ఆయుష్‌ను అడగ్గా, వైభవ్ లక్ష్యం కేవలం పాకిస్తాన్‌పై మాత్రమే కాదని, ఈ టోర్నమెంట్ మొత్తంలో మంచి ప్రదర్శన చేసి టైటిల్ గెలవాలని ఉందని చెప్పిన విషయాన్ని ఆయుష్ గుర్తు చేసుకున్నాడు.

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరు ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో వర్షం కారణంగా ఒక్క ఓవర్‌ను తగ్గించారు. దీంతో ఇరు జట్లు 49-49 ఓవర్లు ఆడనున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా తాము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నామని తెలిపాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే లేటెస్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వికెట్ పోగొట్టకుంది.

ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు

భారత్ U19 జట్టు: ఆయుష్ మ్హాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండూ, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ సింగ్, హెనిల్ పటేల్.

పాకిస్తాన్ U19 జట్టు: ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసుఫ్ (కెప్టెన్), హమ్జా జహూర్, హుజైఫా అహ్సన్, నికాబ్ షఫీక్, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ సయ్యం, అలీ రాజా.