Tomato: ఢమాల్.. అమాంతం రూ.2కు పడిపోయిన టమాటా ధరలు.. లబోదిబోమంటున్న రైతులు..

ఉంటే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. అన్నట్లుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే దిగుబడి రాక, వచ్చినా సరైన గిట్టుబాటు ధర లేక వారు పడే బాధలు వర్ణనాతీతం. ప్రెసెంట్ టమోటా ఫార్మర్స్..

Tomato: ఢమాల్.. అమాంతం రూ.2కు పడిపోయిన టమాటా ధరలు.. లబోదిబోమంటున్న రైతులు..
Tomato Price Fall Down

Updated on: Dec 03, 2022 | 11:14 AM

ఉంటే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. అన్నట్లుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే దిగుబడి రాక, వచ్చినా సరైన గిట్టుబాటు ధర లేక వారు పడే బాధలు వర్ణనాతీతం. ప్రెసెంట్ టమోటా ఫార్మర్స్ ఇలాంటి సిట్యూవేషన్ నే ఫేస్ చేస్తున్నారు. మార్కెట్ లో టమోటా రేట్లు దారుణంగా పడిపోయాయి. కిలో రూ.5 నుంచి రూ.10 లోపే పలుకుతున్నాయి. రైతులకు మాత్రం కిలోకు రూ.2 చెల్లిస్తుండడంతో అన్నదాతలు అవాక్కవుతున్నారు. కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. దీంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే సరైన ధర దక్కక నట్టేట మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 15 నుంచి 20వేల ఎకరాల్లో టమోటా పంట సాగు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధికంగా పంట సాగయింది. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. సరిగ్గా అమ్ముకునే సమయంలో ధర పడిపోయింది. టమాటాలు తెంపి మార్కెట్​తీసుకుపోతే వ్యాపారులు రూ.2 నుంచి రూ.3 లోపే ఇస్తామని కరాకరండీగా చెబుతున్నారు. అయితే ధర తగ్గడంతో ప్రజలకు ఏమైనా లాభం కలుగుతుందా అంటే.. లేదనే చెప్పాలి. కేవలం మధ్యవర్తులకు మాత్రమే ఈ లాభమంతా తరలిపోతోంది.

తెలంగాణకు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భారీగా సరకు వస్తోంది. అక్కడి రైతులకు సైతం కిలో టమాటాకు కేవలం రూపాయి మాత్రమే చెల్లిస్తుండడంతో గిట్టుబాటు కాక రోడ్లపై వదిలేస్తున్నారు. దీంతో వాహనాల్లో అక్కడికి వెళ్తున్న వ్యాపారులు చౌక ధరకు కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. మూడు నెలల కింద క్వింటాల్​టమాటాకు రూ.4 వేల వరకు ధఱ పలికింది. క్రమంగా ధరలు దిగివస్తూ కిలోకు రూ.2 ఇచ్చేలా పడిపోయాయి. పక్క రాష్ట్రాల నుంచి సరకు అధికంగా రావడంతో ఈ సమస్య తలెత్తిందని వ్యాపారులు చెబుతున్నారు.

మరోవైపు.. పంటకు గిట్టుబాటు ధర రాక పాలమూరు జిల్లాలో ని రైతులు వారం రోజులుగా పంటను తెంపడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేటు మంచిగా వస్తుందని అనుకున్న సమయంలో వ్యాపారులు రేటు తగ్గించేశారని, కిలో టమాటను రూ.2కు అడుగుతున్నరాని చెబుతున్నారు. అందుకే వారికి పంటను అమ్మలేక తెంపకుండా వదిలేస్తున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు .

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..