Telangana: వర్త్ వర్మ వర్త్.! రూ. 10 వేలకే రూ. 30 లక్షల భూమి.. ఈ రైతు ఐడియా చూస్తే
భూముల ధరలు తగ్గిపోవడం, రియల్ ఎస్టేట్ కుదేలు అవ్వడంతో.. ఓ రైతు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఆ నిర్ణయంతో ఆసక్తి కనబరిచిన వారికి పోతే రూ. 10 వేలు.. వస్తే రూ. 30 లక్షల భూమి వస్తుంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

భూములు ధరలు పడిపోయాయి. మార్కెట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన భూమిని అమ్మేందుకు ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తాను అనుకున్న ధర పొందేందుకు లక్కీ డ్రా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన యువ రైతు గడ్డం రాజు తనకున్న రెండు ఎకరాల 10 గుంటల భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.30 లక్షల ధర పలికేది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవడంతో మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు భూమి కొనడానికి వస్తున్నారు. దీంతో రాజు 500 లక్కీ డ్రా టికెట్లను.. ఒక్కో టికెట్‌ను 10వేలకు విక్రయించాలని నిర్ణయించాడు.
మొదటి రోజైన ఆదివారం 30 టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపాడు. వచ్చే సంక్రాంతిలోగా డ్రా ప్రక్రియ ముగిస్తానని, టికెట్లు కొనుగోలు చేసిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నానని తెలిపాడు. డ్రా తీసే రోజు అందుబాటులో లేని సభ్యులు కోసం యూట్యాబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఇవ్వనున్నట్లు కరపత్రంలో పేర్కొన్నాడు. రైతు ప్రణాళిక ప్రకారం, ఒక్కో సభ్యుడు రూ. 10,000 చెల్లించడం ద్వారా ‘లక్కీ డ్రా’లో ఒక స్థానాన్ని పొందవచ్చు. 500 మంది సభ్యులు ఈ డ్రాలో చేరినట్లయితే, రైతుకు మొత్తం రూ.50 లక్షలు సమకూరుతాయి. స్థానిక రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా ప్రకారం, ఆ ప్రాంతంలో 2 ఎకరాల 10 గుంటల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉంది. అంటే, ఈ వినూత్న పద్ధతి ద్వారా రైతు తన భూమికి మార్కెట్ కంటే సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు అధికంగా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సంక్రాంతి పండగ రోజు లక్కీ డ్రా నిర్వహించనున్నాడు.
పోతే పదివేలు లేదంటే రెండెకరాల భూమి వస్తుందనే ఆలోచనతో లక్కీ డ్రా కూపన్ తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కామారెడ్డి వాసులు. కానీ 500 మంది సభ్యులు కాకుంటే ఎలా అనే చర్చ నడుస్తుంది. పైగా ఈ లక్కీ డ్రాకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి అనేది ప్రశ్నార్థకం. ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి కొత్త తరహా ట్రెండ్ నడుస్తుంది. మార్కెట్ విలువ పడిపోవటం, రియల్ ఎస్టేట్ కుదేలు కావటంతో చాలామంది ఇలాంటి తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మాక్లూర్ మండలంలో ఒక ఉపాధ్యాయుడు ఇదే తరహాలో తన ఇల్లు అమ్మకానికి పెట్టారు. అయితే ఇలాంటి లక్కీ డ్రాలపై అధికారులు దృష్టి పెట్టి ఎలాంటి మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
