Telangana: ఒక్కసారి వాటి జోలికి వెళ్తే.. జీవితాలు నాశనమే.. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న శిక్షలు!
తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన వైఖరితో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పెరుగుతుండటం నిందితుల్లో భయాందోళనలు పెంచుతోంది. నేరాలు తగ్గాలంటే శిక్షలు తప్పనిసరి అనే నమ్మకంతో ఎక్సైజ్ యంత్రాంగం విచారణ నుంచి పంచానామా, చార్జీషీట్ దశల వరకూ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.

గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగంపై ఎక్సైజ్, పోలీసు, టీజీ న్యాబ్ దాడులు కొనసాగుతున్నాయి. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ఆధారంగా కేసులు నమోదు చేసి కోర్టుల్లో బలమైన సాక్ష్యాలతో కన్విక్షన్ల వరకు తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఎక్సైజ్ శాఖలో డ్రగ్స్ రాకపోకలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
కమిషనర్ సి. హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం మార్గదర్శకత్వంలో గంజాయి, డ్రగ్స్‌తో పాటు నాన్‌డ్యూటీ పేడ్ లిక్కర్, నాటు సారా విక్రయాలపై కూడా దాడులు ముమ్మరం చేశారు. గత నాలుగేళ్లలో ఎక్సైజ్ శాఖ రికార్డు స్థాయిలో డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుంది. 2021–2025 మధ్యలో 4,194 కేసుల్లో.. 7,131 మందిని నిందితులుగా చేర్చారు. 1,824 వాహనాల సీజ్ చేసి.. 24,236 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 21,035 గంజాయి మొక్కలను నాశనం చేశారు.
2021–2025 మధ్య కాలంలో 2803.13 గ్రాముల MDMA, 689 LSD బ్లాట్స్, 46.47 కేజీల హష్ ఆయిల్, 383 గ్రాముల కోకైన్, 701.3 గ్రాముల హేరాయిన్, 227.6 గ్రాముల ఓపియమ్ సీజ్ చేశారు. ప్రస్తుతం కోర్టుల్లో 2659 కేసులు నడుస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటునుంచి 2022 వరకు కేవలం 22 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డా.. సీఎం తాజా ఆదేశాల తర్వాత పరిస్థితి మారిపోయింది. 2023–2025 మధ్య 49 కేసుల్లో 152 మందికి శిక్షలు అమలు చేశారు.
2023లో 16 కేసులు నిందితులకు శిక్ష ఖరారు చేయగా.. 2024లో 11 కేసులు శిక్ష పడింది. 2025 రికార్డు స్థాయిలో 22 కేసుల్లో శిక్షలు అమలు చేశారు. మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు 71 కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. పోలీసు శాఖ కన్విక్షన్ రేటు: 2.29% ఉండగా, ఎక్సైజ్ శాఖ కన్విక్షన్ రేటు: 3.23%గా ఉంది. ఎక్సైజ్ శాఖ కన్విక్షన్ శాతం పెరగడంతో నిందితుల్లో భయం పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.
నేరం చేసిన తర్వాత శిక్షలు పడితేనే నేరస్థుల్లో భయం పెరుగుతుంది. ఇటీవల ఎక్సైజ్ కేసుల్లో శిక్షలు పెరగడం చాలా పెద్ద పాజిటివ్ సిగ్నల్. డ్రగ్స్, గంజాయి మీద మరింత దూకుడుతో చర్యలు కొనసాగిస్తా అని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
