AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని వదులుతారా సార్..

కరీంనగర్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ వైద్యం అంటే సేవ అనే భావనతో ముందుకు సాగుతున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లాకే తీసుకురావడంతో పాటు, స్ట్రోక్ చికిత్సలో అవగాహన కల్పిస్తూ వేలాది మందికి ఆశగా నిలిచారు. తాజాగా 100 మంది పేద విద్యార్థులకు రూ.10 లక్షల స్కాలర్‌షిప్ ప్రకటించి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని వదులుతారా సార్..
Dr Vikrant Singh Thakur
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 20, 2026 | 7:33 PM

Share

డాక్టర్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది చికిత్స. కానీ కొందరు వైద్యులు మాత్రం చికిత్సకే పరిమితం కాకుండా సమాజానికి ఆశ, నమ్మకం, అండగా నిలుస్తారు. అలాంటి అరుదైన వైద్యుల్లో కరీంనగర్‌కు చెందిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెదడు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో తెలంగాణలో ప్రముఖ న్యూరాలజిస్టుగా గుర్తింపు పొందిన ఆయన, వైద్యం అనేది కేవలం వృత్తి కాదని.. అది సేవ అని తన పనితో నిరూపిస్తున్నారు.

కరీంనగర్‌లోని టైమ్ న్యూరోకేర్ హాస్పిటల్ ద్వారా గ్రామీణ ప్రజలకు మెట్రో నగరాల స్థాయి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే కనిపించే 3-టెస్లా ఎంఆర్ఐ, 32-స్లైస్ సీటీ స్కాన్ వంటి అత్యాధునిక పరికరాలను జిల్లాలోనే ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది రోగులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించారు. వైద్య సేవలు నగరాలకే పరిమితం కాకూడదనే ఆయన ఆలోచనకు ఇది నిదర్శనం.

డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ విద్యాభ్యాసం కూడా ఎంతో విశిష్టమైనది. ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసి, అనంతరం న్యూరాలజీలో డీఎం చేశారు. ప్రముఖ న్యూరాలజిస్టు డా. పి.ఎల్. జాన్ ఇజ్రాయెల్ వద్ద శిక్షణ పొందడం ద్వారా తన నైపుణ్యాన్ని మరింత పదునుపెట్టుకున్నారు. స్ట్రోక్ చికిత్సలో అత్యంత కీలకమైన థ్రాంబోలిసిస్ విధానాన్ని ప్రజల్లో విస్తృతంగా పరిచయం చేసిన వైద్యుల్లో ఆయన ఒకరు. పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటలలోపు ఈ చికిత్స అందితే రోగి కోలుకునే అవకాశాలు ఎంతో పెరుగుతాయని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అత్యవసర వైద్యం ఎంత ముఖ్యమో వివరిస్తూ అనేక ప్రాణాలను కాపాడారు.

అయితే ఆయన ప్రత్యేకత ఆసుపత్రి గోడల మధ్య మాత్రమే ఆగిపోలేదు. సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, క్యాన్సర్‌కు దారితీసే అలవాట్లు, సరైన ఆహారం, జీవనశైలి వంటి అంశాలను సులభమైన భాషలో వివరిస్తున్నారు. వైద్యం కోసం మాత్రమే కాదు.. వ్యాధులు రాకుండా ఎలా జీవించాలన్న దానిపై కూడా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఇటీవల ఆయన చేసిన మరో నిర్ణయం ఎంతో మందిని కదిలించింది. 100 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10 లక్షల స్కాలర్‌షిప్ అందిస్తానని ప్రకటించారు. “నేను కూడా పేద కుటుంబం నుంచే వచ్చాను. చాలా మంది సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు నా వంతుగా ఇంకో వంద మంది పిల్లలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను” అనే ఆయన మాటలు వేలాది మంది హృదయాలను తాకాయి. స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా నిజంగా అవసరమైన విద్యార్థులకు సహాయం అందేలా చూడటం ఆయన పారదర్శకతకు నిదర్శనం.

అయితే సమాజంలో మంచి చేసే వారిని ప్రశంసించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉంటారు. ఇటీవల డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్‌పై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, ఆయనపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం కూడా కనిపిస్తోంది. డాక్టర్లు అంటే టచ్ చేస్తే వేలు, సర్జరీ చేస్తే లక్షలు తీసుకోవాలి. కానీ ఈయనేమో అసలు అనారోగ్యమే దరి చేరకుండా జాగ్రత్తలు చేబుతున్నాడు. మరి చాలామందికి కాలుతుంది కదా..?. అందుకే ఈ రీల్స్ డాక్టర్‌పై మరొకొందరు డాక్టర్లు సోషల్ మీడియాలో అటాక్ చేయడం షురూ చేశారు. కానీ ఒక వ్యక్తి గురించి తుది అభిప్రాయం ఏర్పడేది సోషల్ మీడియా పోస్టులతో కాదు… ఆయన చేసిన పనులతో.

వేలాది మంది రోగులకు చికిత్స అందించడం, అత్యాధునిక వైద్యాన్ని జిల్లాకు తీసుకురావడం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడం, పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు ఆయన సేవాభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ రోజుల్లో వైద్యం వ్యాపారంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్న సమయంలో… వైద్యాన్ని సేవగా భావించే డాక్టర్లు ఇంకా ఉన్నారనే విషయాన్ని డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ వంటి వ్యక్తులు గుర్తు చేస్తున్నారు.

సమాజానికి అవసరమయ్యేది ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులే. మంచి పని చేసే వారిని ప్రోత్సహించడం, అవసరమైతే నిర్మాణాత్మకంగా విమర్శించడం ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆధారాలు లేకుండా వ్యక్తిగత దూషణలు చేయడం కంటే, వారు సమాజానికి అందిస్తున్న సేవలను కూడా సమానంగా గుర్తించడం అవసరం.

ఒక వైద్యుడు రోగులను మాత్రమే కాదు… వారి కుటుంబాలకు ఆశను కూడా అందించగలడు. ఒక విద్యార్థికి చేయూత ఇస్తే అతని భవిష్యత్తును మార్చగలడు. ఆ రెండు బాధ్యతలను సమానంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్న డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ వంటి వైద్యులు నిజంగా సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారు.

View this post on Instagram

A post shared by Dr. VIKRANT (@drvikranta)

Follow Us