AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతకాదన్న చోటే లక్షల కోట్ల సామ్రాజ్యం.. భారతీయుడి జీవితంలో భాగమైన టాటా సక్సెస్ సీక్రెట్ ఇదే..

మనం ఉదయం లేవగానే తాగే టీ నుంచి.. వంటల్లో వాడే ఉప్పు, ఒంటిపై వేసుకునే బట్టలు, రోడ్లపై తిరిగే కార్లు, చివరకు చేతిలో ఉండే ఐఫోన్ విడిభాగాల వరకు.. భారతీయుల నిత్యజీవితంలో టాటా ఓ భాగం. ఒకప్పుడు అమెరికా కార్ల దిగ్గజం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి నుంచి.. నేడు ప్రపంచ ఆటోమొబైల్, ఈవీ మార్కెట్‌ను శాసించే స్థాయికి టాటా ఎలా ఎదిగింది? ఉప్పు అమ్మే కంపెనీ అనుకున్నోళ్లే నోరెళ్లబెట్టేలా చేతిలో ఉండే ఐఫోన్ల తయారీ, రేపటి ప్రపంచాన్ని ఏలే సెమీకండక్టర్ల చిప్స్ దాకా టాటా వేస్తున్న ఆ మైండ్ బ్లోయింగ్ అడుగుల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..

చేతకాదన్న చోటే లక్షల కోట్ల సామ్రాజ్యం.. భారతీయుడి జీవితంలో భాగమైన టాటా సక్సెస్ సీక్రెట్ ఇదే..
Tata Group Business BreakdownImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Oct 05, 2026 | 5:22 PM

Share

టాటా చరిత్ర తిరగేస్తే వ్యాపార ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రతీకార గాథ కనిపిస్తుంది. 1990ల చివర్లో స్వదేశీ సాంకేతికతతో టాటా తీసుకొచ్చిన ఇండికా కారు ఆశించిన స్థాయిలో మార్కెట్ అందుకోలేక తీవ్ర నష్టాలు మిగిల్చింది. ఆ సమయంలో ప్యాసింజర్ కార్ల విభాగాన్ని విక్రయించేందుకు అమెరికా దిగ్గజ సంస్థ ఫోర్డ్ వద్దకు వెళ్లగా.. బిల్ ఫోర్డ్ నుంచి అవమానం ఎదురైంది. ‘‘కార్ల తయారీ చేతకానప్పుడు అసలు ఈ వ్యాపారంలోకి ఎందుకు దిగారు? మీ వ్యాపారాన్ని కొని మీకు ఉపకారం చేస్తున్నాం’’ అంటూ మాట్లాడారు. ఆ అవమానాన్ని మౌనంగా భరించిన రతన్ టాటా, డీల్ రద్దు చేసుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. కట్ చేస్తే.. 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంలో అదే ఫోర్డ్ సంస్థ దివాలా అంచుకు చేరింది. అప్పుడు రంగంలోకి దిగిన టాటా గ్రూప్.. ఫోర్డ్ చేతుల్లో నష్టాల ఊబిలో కూరుకుపోయిన బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌లను ఏకంగా 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కేవలం కొనుగోలు చేయడమే కాదు కొద్ది కాలంలోనే వాటిని లాభాల బాట పట్టించి ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్నే విస్మయానికి గురిచేసింది.

సేఫ్టీ అస్త్రం.. నెక్సాన్‌తో మొదలైన సరికొత్త శకం

నానో కార్ల ప్రాజెక్టు మార్కెటింగ్‌లో జరిగిన పొరపాట్ల వల్ల ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో టాటా మోటార్స్ రూటు మార్చింది. భారతీయ కార్ల మార్కెట్లో అంతవరకు మైలేజీకి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. కానీ టాటా తొలిసారిగా భద్రతను ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. భారత్‌లో మొట్టమొదటిసారిగా 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో నెక్సాన్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన టియాగో, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీలతో భారతీయ వినియోగదారుల ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ప్యాసింజర్ వెహికల్ విభాగంలో హ్యుందాయ్‌తో పోటీపడుతూ దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.

ఈవీ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ ఏకచ్ఛత్రాధిపత్యం చలాయిస్తోంది. మార్కెట్లో దాదాపు 70 శాతానికి పైగా ఈవీ వాటా టాటా సొంతం కావడానికి కారణం ఒక్క కారు మాత్రమే కాదు.. వాళ్లు నిర్మించిన సమగ్ర ఎకోసిస్టమ్.

టాటా మోటార్స్: టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీలతో బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ప్రతి సెగ్మెంట్‌లో కార్లను సిద్ధం చేసింది.

టాటా పవర్: దేశవ్యాప్తంగా హైవేలు, నగరాల్లో వేల సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తోంది.

టాటా ఆటోకాంప్ – టాటా కెమికల్స్: బ్యాటరీ ప్యాక్‌ల తయారీ, విడిభాగాల సరఫరాను స్థానికంగానే చూసుకుంటున్నాయి. ఈ పరస్పర సహకార వ్యవస్థే పోటీ సంస్థలకు అందనంత ఎత్తులో టాటాను నిలబెట్టింది.

 యాపిల్ ఐఫోన్లు, సెమీకండక్టర్ల రంగంలో దూకుడు

సాంప్రదాయ ఉక్కు, ఉప్పు, ట్రక్కుల తయారీ సంస్థగా ఉన్న గుర్తింపును చెరిపేస్తూ టాటా వేగంగా హైటెక్ దిశగా అడుగులు వేస్తోంది. కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడంతో పాటు పెగట్రాన్ తయారీ ప్లాంట్‌లో మెజారిటీ వాటాను దక్కించుకుని, భారతదేశంలో యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న ఏకైక దేశీయ బ్రాండ్‌గా టాటా చరిత్ర సృష్టించింది. భవిష్యత్ డిజిటల్ విప్లవానికి గుండెకాయ వంటి చిప్‌ల తయారీపై దృష్టి పెట్టింది. గుజరాత్‌లోని ధోలేరా, అసోంలోని జాగీరోడ్‌లలో సుమారు రూ. 1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో అధునాతన సెమీకండక్టర్ ఫ్యాబ్, అసెంబ్లీ టెస్టింగ్ ప్లాంట్లను నిర్మిస్తోంది.

వెన్నెముకగా నిలిచిన టీసీఎస్..

టాటా గ్రూప్ తీసుకునే సాహసోపేతమైన వ్యాపార నిర్ణయాలకు ఆర్థిక వెన్నెముక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. లక్షల కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో, స్థిరమైన డివిడెండ్లతో గ్రూప్‌లోని ఇతర ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూస్తోంది. మరోవైపు విస్తారా, ఎయిరిండియాలను ఒక్కతాటిపైకి తెచ్చి ప్రపంచస్థాయి ఏవియేషన్ సంస్థగా నిలబెట్టేందుకు వందల సంఖ్యలో కొత్త విమానాలను సమకూర్చుకుంటూ పునర్వైభవం కోసం శ్రమిస్తోంది. చాలా కార్పొరేట్ కంపెనీలు రాబోయే మూడు నెలల త్రైమాసిక లాభాల గురించే ఆలోచిస్తుంటే.. టాటా గ్రూప్ మాత్రం రాబోయే మూడు దశాబ్దాల ప్రపంచ అవసరాలను అంచనా వేస్తూ అడుగులు వేస్తోంది. సంక్షోభాల నుంచి అవకాశాలను ఒడిసిపట్టే ఈ దీర్ఘకాలిక వ్యూహమే నేడు టాటాను భారత పారిశ్రామిక రంగానికి రారాజుగా నిలబెట్టింది.

Follow Us