AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iBomma: ఇమ్మడి రవికి నెల్లూరుకు ఉన్న లింక్ ఏంటో తెల్సా.? అసలు ఐబొమ్మ, బప్పం సైట్స్ డిజైన్ ఎక్కడ జరిగిందంటే.!

ఐ -బొమ్మ వెబ్‌సైట్ రూపకల్పనలో నెల్లూరు యువకులు ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇమ్మడి రవి క్లాస్ మేట్స్‌గా ఉన్న ఆత్మకూరుకు చెందిన ప్రశాంత్ , సీతారామపురంలోని శివాజీ ఐ-బొమ్మ అంకురార్పణలో కీలకంగా వ్యవహరించారని గుర్తించి ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశం జిల్లాలో నేడు చర్చనీయాంశంగా మారింది.

iBomma: ఇమ్మడి రవికి నెల్లూరుకు ఉన్న లింక్ ఏంటో తెల్సా.? అసలు ఐబొమ్మ, బప్పం సైట్స్ డిజైన్ ఎక్కడ జరిగిందంటే.!
Ibomma Ravi
Ch Murali
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 20, 2025 | 8:09 PM

Share

గత కొన్నేళ్లుగా ఐ బొమ్మ, బప్పం వైబ్ సైట్ల పేరు మారుమోగుతూ వచ్చింది. సినిమాల పైరసీలతో ఈ రెండు వెబ్ సైట్స్ నిర్వహకులు ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాదకుమార్ పోలీసులకే సవాళ్లు విసురుతూ వచ్చారు. ఎట్టికేలకు ఈనెల 17న హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్టుచేశారు. ఈసందర్బంగా ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్‌లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవారు, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు పేర్కొన్నారు. ఇమ్మడి రవితో పాటు ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురంకి చెందిన వెబ్ డిజైనర్ డీ శివాజీ. ఆత్మకూరులోని ప్రైవేట్ ఉద్యోగి ఎస్ ప్రశాంత్ లను పోలీసులు అరెస్టు చేశారు. రవి బ్యాంకు ఖాతాల నుంచి మూడున్నర కోట్ల రూపాయలను సీజ్ చేశారు. కాగా సినీ పరిశ్రమతో పాటు పోలీసులకు చుక్కలు చూపించిన ‘ఐబొమ్మ’ రవి కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు మూడు నెలల పాటు వేటాడారు. ఇమ్మడి రవికి సహకరించిన ప్రశాంత్, శివాజీలను సెప్టెంబర్‌లో పట్టుకున్నా.. రవి గురించి ఎలాంటి సమాచారం వారినుంచి రాబట్టలేక పోయారు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు ఈనెల 14న రవి ఆచూకీ కనిపెట్టింది.

కరేబియన్ దీవుల్లో సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆస్తుల్నిఅమ్మేయడానికి వచ్చిన ఇమ్మడి రవి పోలీసులకు చిక్కి ప్రస్తుతం కటకటాలలో ఉన్నారు. దమ్ముంటే పట్టుకో షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అన్న పుష్ప సినిమా డైలాగ్‌ను ఇమ్మడి రవి చేత నిజం చేయించారు. పోలీసులకు చిక్కిన ఆ వ్యక్తి చేతే ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్‌లను క్లోజ్ చేయించడం సర్వత్రా చర్చ సాగుతోంది. సాగినంతా కాలం నాకు ఎదురు ఎవ్వరు అంటూ సవాల్ విసిరే వారికి.. అదే కాలం కలిసిరాకపోతే ఇలానే ఉంటుందని ఇమ్మడి రవి జీవితం నిజం చేసింది.

ఇమ్మడి రవి అనే ప్రహ్లాద్ కుమార్ బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత వెబ్ డిజైనర్, డొమైన్ డెవలపర్‌గా మారారు. ఎంబీఏలో క్లాస్ మేట్స్ అయిన ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురంకి చెందిన వెబ్ డిజైనర్ డీ శివాజీ. ఆత్మకూరులోని ప్రైవేట్ ఉద్యోగి ఎస్ ప్రశాంత్ 2018లో ఐబొమ్మ వెబ్ సైట్ రూపకల్పనలో సహకరించారు. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన సెల్ ఫోన్ నంబర్ కోసం ప్రశాంత్ సిమ్ కార్డును వినియోగించారు. అలా 2018లో మొదలైన ఐబొమ్మ వెబ్ సైట్ 2020లో కరోనా లాక్ డౌన్‌తో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఐ బొమ్మ ఫేమస్ కావడంతో వెబ్‌సైట్ ట్రాఫిక్ మానిటరింగ్ చేసేవారు. ఈ విషయం గమనించడంతో అనేక గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్ నిర్వాహకులు యాడ్స్ పోస్టు చేయడం కోసం సంప్రదించారు. వారితో ఒప్పందాలు చేసుకున్న రవి తొలినాళ్లలో ప్రతి నెలా 5 లక్షల రూపాయలు వరకు సంపాధించేవారు.

అలా నేడు 20 లక్షలు ఆర్జిస్తున్నాడు. ఈ క్రమంలో ఎదోరోజు ఐబొమ్మ మూతపడుతుందని 2022లో కొత్తగా బప్పం వెబ్ సైట్‌ను ప్రారంభించారు. 2022లో భారత పాస్ పోర్టును అప్పగించి, లక్ష డాలర్లు చెల్లించడం ద్వారా కరేబియన్ దీవిల్లో ఒక దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పౌరసత్వం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా పోలీసులు తనపై దృష్టి పెట్టారని తెలుసుకున్న రవి.. సెయింట్ కిట్స్ అండ్ నెవీస్‌లో స్థిరపడిపోవాలని భావించాడు. తన ఆస్తుల్ని విక్రయించేందుకు వచ్చి హైదరాబాద్ మూసాపేటలోని తన ఫ్లాట్‌లో పోలీసులకు చిక్కాడు. ఐ బొమ్మ వెబ్ సైట్ ఆవిర్భావంలో నెల్లూరు జిల్లా యువకులు ఉన్నారనే సమాచారంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఐబొమ్మ మూలాలకు నెల్లూరు కేంద్రం అయ్యిందని ప్రచారం సాగుతోంది. ఐబొమ్మ ఫేమస్ కావడంతోపాటు ఆదాయం భారీగా వస్తుండటంతో ఇమ్మడి రవి క్లాస్ మెట్స్‌గా ఉన్నప్రశాంత్, శివాజీలను పక్కన పెట్టివారితో తెగతెంపులు చేసుకున్నారు.

2020నుంచి వారితో పూర్తి దూరమైనట్లు సమాచారం. ఐ బొమ్మ, బప్పం, ఐరాదే సహా మొత్తం 65 వెబ్సైట్లు, మిర్రర్ సైట్లపై ఇటీవల ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమను, పోలీసుల్ని చేతనైతే తమను పట్టుకోవాలన్నట్టుగా ఇమ్మడి రవి సవాల్ చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం ఐబొమ్మ వెబ్ సైట్ ఏర్పాటు పూర్వాపరాలు పరిశీలించి ప్రశాంత్, శివాజీ పాత్ర గుర్తించారు. సెప్టెంబర్ 22న పుణేలో ప్రశాంత్‌ను , అదే నెల 24న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శివాజీని అరెస్టు చేశారు. 2020 తర్వాత వీరికి రవితో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో తాజా వివరాలు వారు చెప్పలేకపోయారని పోలీసులు వెల్లడించారు. ప్రశాంత్ , శివాజీలు ఇద్దరు ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాదులోనే స్థిరపడినట్లు సమాచారం. ఎప్పడైన సొంతూరుకు వచ్చిన ఎవరితో మాట్లాడేవారు కాదని స్థానికులు పేర్కొంటున్నారు. చదువుకుని మంచి ప్రయోజకులు అవుతారని భావించిన ఆ ఇద్దరు పైరసీ మార్గంలో నడిచి పోలీసులకు చిక్కి జైలు జీవింతం గడుపుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనమైన ఐ బొమ్మ, వెబ్ సైట్ రూపకల్పనలో నెల్లూరు జిల్లా యువకుల పాత్ర ఉందన్న సమాచారం దుమారం రేపుతోంది.