AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమే.. సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో వెల్లడి

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు 387 పేజీల నివేదిక సమర్పించింది.

Disha Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమే.. సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో వెల్లడి
Disha Case Accused Encounter
Ram Naramaneni
|

Updated on: May 20, 2022 | 3:09 PM

Share

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమే అని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక వెల్లడించింది. సుప్రీం ఆదేశాలతో కమిషన్ న్యాయవాది.. వాద ప్రతివాదులకు కమిషన్ రిపోర్ట్ అందజేశారు. 387 పేజీలతో కూడిన ఈ నివేదికలో కీలక విషయాలు పొందుపరిచారు కమిషన్ సభ్యులు. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే నిందితులను కాల్చి చంపారని పేర్కొన్నారు. తక్షణ న్యాయం కోసమే ఎన్‌కౌంటర్ అని స్పష్టం చేశారు. విచారణ పేరుతో నిందితులను అధికారులు వేధించారని..  పోలీస్ మాన్యవల్‌కు విరుద్దంగా విచారణ జరిగిందని తెలిపారు. నిందితులు కస్టడీలో ఉన్నప్పటి నుంచి కేసు నమోదు చేసిన అధికారులు కాకుండా… వేరే వింగ్ అధికారులు వెంబడే ఉన్నారని పేర్కొన్నారు. స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు నిందితులు విచారణలో పాల్గొన్నారని కమిషన్‌ నివేదికలో తెలిపింది. ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యం లేదని కమిషన్ స్పష్టం చేసింది. పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని సిర్పూర్కర్ కమిషన్ సూచించింది. పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి.జానకిరాం, ఆర్.బాలూ రాఠోడ్, డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని నివేదికలో పేర్కొంది. కమిషన్ తీర్పుతోనైనా ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబసభ్యులు ఆశిస్తున్నారు.

కీలక కామెంట్స్ చేసిన సుప్రీం కోర్టు…

అంతకుముందు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ విలాస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ తెలంగాణ హైకోర్టుకు పంపించాలని ఆదేశించింది. రిపోర్టుపై నిర్ణయం హైకోర్టే తీసుకుంటుందని స్పష్టంచేసింది. కమిషన్‌ రిపోర్టు కాపీని సంబంధిత పక్షాలకు అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ NV రమణ, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

కమిషన్ నివేదికను సీల్డ్‌ కవర్‌లోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది శ్యామ్ దివాన్‌ వాదనలు వినిపించారు. ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. నివేదిక గోప్యంగా ఉంచాల్సిన అవసరమేమి లేదని స్పష్టం చేసింది. కొందరు తప్పుచేసినట్టు తేలిందని, దానిని ప్రభుత్వం పరిశీలించాలని న్యాయస్థానం ప్రకటించింది. రిపోర్టు వచ్చిందంటే దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ అన్నారు.