హైదరాబాద్, మార్చి 25: మేడారం మినీ జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతల దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు మిస్సయ్యాడు. అతడు ఏమైపోయాడో తెలియక నెలరోజుల నుండి వెతుకుతున్న పోలీసులు, కుటుంబసభ్యులకు అతని డెడ్ బాడీ లభ్యమైంది. గుర్తు పట్టలేని విధంగా కారడవిలో అతని అస్థిపంజరం లభ్యమైంది. మృతుడు వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన సారంగంగా గుర్తించారు. ఫిబ్రవరి 13వ తేదీన మినీ జాతరకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు. కుటుంబమంతా కలిస జంపన్నవాగు సమీపం అడవిలో విడిది చేశారు. మద్యం సేవించిన సారంగం పక్కనే ఉన్న అడవిలో కి వెళ్లి దారి తప్పాడు.
అతని కోసం ఒక రోజంతా గాలించిన కుటుంబసభ్యులు ఏమైపోయాడో తెలియక ఆందోళన చెందారు.. వెంటనే తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదుచేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ ఫలితం దక్కలేదు. అతని ఆచూకీలభ్యం కాలేదు. తాజాగా సోమవారం అడవిలో విధులు నిర్వహిస్తున్న ఆ ప్రాంత అటవీశాఖ సిబ్బందికి అక్కడ దుర్వాసన రావడంతో అటుగా వెళ్లి ఉదయాన్నే గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు సారంగంగా గుర్తించారు. అడవిలో దారి తప్పిన సారంగం నీళ్లు ఆహారం అందక ఆకలితో అలమటించి మృతి చెందినట్లుగా గుర్తించారు. డెడ్ బాడీకి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.