Telangana: ఎన్నికలు అయిపోయాక మళ్లీ ఇంటింటికి ఓడిన అభ్యర్థి.. ఎందుకంటే..?
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఓడిపోయిన కొందరు అభ్యర్థులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని దేవుడి ఫోటోతో ఇళ్లు.. ఇళ్ళు తిరుగుతూ వేడుకుంటున్నారు. అలాంటి ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ గెలవడం అసాధ్యం. కొందరు మాత్రమే విజయం సాధిస్తుంటారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొందరికి మోదం మిగిల్చగా.. మరికొందరికి దుఃఖాన్ని మిగిల్చింది. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఔరవాణిలో తొలి విడతలో 1577 ఓట్లు ఉన్న గ్రామపంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీల మద్దతుదారులతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిసి నలుగురు బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారుడు జక్కల పరమేష్ విజయం సాధించాడు. ద్వితీయ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి బాలరాజు గౌడ్ నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన 10 లక్షల పైగా ఖర్చు చేశాడట. అయినా ఓటమి చెందడంతో అతను తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓడిన అభ్యర్థి ఇంటింటికి తిరిగి అడుగుతున్నారు. దేవుడు చిత్రపటం పట్టుకొని డబ్బులు ఇవ్వాలంటూ తిరుగుతున్నారు. డబ్బులు తీసుకుని ఓటు వేయని వారు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నారు. అప్పు చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టామని.. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ అభ్యర్థి భార్య చేతిలో పురుగుల మందు డబ్బా చేత పట్టుకుని గ్రామ ఓటర్లను వేడుకుంటున్నాడు. అయితే ఓట్లు వేశామంటూ దేవుడిపై పలువురు ప్రమాణం చేశారు. అందరూ ఓట్లు వేశారు మరి తాను ఎలా ఓడిపోయానంటూ అభ్యర్థి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




