Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!

వన్యప్రాణులైన జింకలు.. చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. చెంగు చెంగున దూకుతుంటే మరెంతో ముచ్చటేస్తుంది. అలాంటి జింకలు వందల సంఖ్యలో కనిపిస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం రైతులు శాపంగా భావిస్తున్నారు. కృష్ణ నదీ తీరంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న జింకలు పంటలను నాశనం చేస్తున్నాయి.

Telangana: కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!
Deers
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jul 25, 2024 | 10:55 AM

వన్యప్రాణులైన జింకలు.. చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. చెంగు చెంగున దూకుతుంటే మరెంతో ముచ్చటేస్తుంది. అలాంటి జింకలు వందల సంఖ్యలో కనిపిస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం రైతులు శాపంగా భావిస్తున్నారు. కృష్ణ నదీ తీరంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న జింకలు పంటలను నాశనం చేస్తున్నాయి. అసలు ఏంటీ ఈ జింకల హిస్టరీ.. ఇంతకు ఎక్కడ ఈ స్టోరీ తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా నదీ తీరంలో జింకలు కలవరపెడుతున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, కృష్ణ, నర్వ, మాగనూరు, ఊట్కూర్ తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో జింకల బెడద రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను గుంపులు, గుంపులుగా వచ్చి నాశనం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రాంతంలోని కృష్ణ, భీమా నదుల పరీవాహక ప్రాంతాల్లో జింకల సంతతి గతంతో పోల్చితే భారీగా పెరిగిపోయింది. 15ఏళ్ల క్రితం నాడు పదుల సంఖ్యలో ఉన్న ఈ జింకలు ఇప్పుడు వేల సంఖ్యకు పెరిగిపోయాయి. నీటి సౌలభ్యం పెరిగి సాగునీరు పుష్కలంగా అందడంతో మక్తల్ నియోజకవర్గంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే నీటి వనరులు, సాగు విస్తీర్ణంతోపాటు ఈ జింకల బెడద కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. దీంతో మక్తల్ నియోజకవర్గ రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవతోంది.

గుంపులు గుంపులుగా సంచరిస్తూ…!

తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా నదీ తీర ప్రాంతంలో నీరు, పంటల సాగు జింకలు ఆకలీ, దప్పిక తీర్చుతున్నాయి. దీంతో కర్ణాటక రాష్ట్రం వైపు నుంచి సైతం జింకలు ఇక్కడికే వస్తూ సెటిల్ అయిపోతున్నాయి. ఈ జింకల గుంపు దాదాపుగా 50 నుంచి 100 వరకు సంచరిస్తు పంటలను తినడం, పాదాలతో తొక్కడం చేస్తున్నాయి. ఈ జింకల మందలకు కొమ్ములతో కూడిన మగ కృష్ణ జింకలు తోడుగా ఉంటాయి. మక్తల్ నియోజకవర్గంలోని రైతులు పత్తి, ఆముదం, చిరుధాన్యల పంటలు పండిస్తుంటారు. అయితే విత్తనాలు విత్తే సమయం నుంచి పంట చేతికి వచ్చే దాక ఈ జింకల బారి నుంచి ఎంతో జాగ్రత్తగా పంటలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొంత మంది రైతులు పంటలకు పగలు, రాత్రి కాపాల ఉంటుంటూ మరికొందరు పంట రక్షణ కోసం పోలాల చుట్టు కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పగలు, రాత్రి తేడా లేకుండా జింకల గుంపులు చేలల్లో చోరబడిపోతున్నాయి.

ఇలా దాదాపు 15ఏళ్ల నుంచి అన్నదాతలకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట అంతా జింకల పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి విత్తనాలు కొని దుక్కి దున్ని విత్తుతే మొలకెత్తగానే వాటిని తినేస్తున్నాయని చెబుతున్నారు. ఈ జింకలను తాము ఏమి చేయలేకపోతున్నామని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతూ పంటలకు నష్టం చేకూర్చుతున్న వీటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని రైతులు కోరుతున్నారు.

జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు:

పలుమార్లు రైతుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముడుమాల్ లో జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చింది. దీంతో జింకల బెడద ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ఈ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు నారాయణపేట్ జిల్లా ఎఫ్ఆర్వో వంశీకృష్ణ తెలిపారు. త్వరలోనే ప్రతిపాదనలకు అనుమతులు వస్తే జింకల తరలింపు చేపడతామని వెల్లడించారు. మరోవైపు రైతులు సైతం పంటల రక్షణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అవలంభించాలని ఫారెస్టు అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా తమకు ఈ జింకల బెడద నుంచి పరిష్కారం చూపాలని మక్తల్ నియోజకవర్గ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 15ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..