Telangana: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. పోలీసుల దాడుల్లో విస్తుపోయే విషయాలు..

దేశంలో జింకలను వేటాడం తీవ్రమైన నేరం. ఈ తప్పు చేసినందుకు సల్మాన్ ఖాన్ అంతటి వ్యక్తి సైతం ఇప్పటికై కేసులు ఎదర్కొంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జింక మాంసం అక్రమ విక్రయాలు కలకలం రేపాయి. పోలీసులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి.. 15 కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Telangana: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. పోలీసుల దాడుల్లో విస్తుపోయే విషయాలు..
Deer Meat Racket Busted In Hyderabad

Updated on: Dec 30, 2025 | 8:12 PM

హైదరాబాద్ నగర శివార్లలో వన్యప్రాణుల అక్రమ వేట, మాంసం విక్రయాలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో జింక మాంసాన్ని విక్రయిస్తున్న ఓ వ్యక్తి పట్టుబడటం సంచలనంగా మారింది. సులేమాన్ నగర్‌కు చెందిన మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి అడవిలో జింకను వేటాడి, దాని మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచిన రాజేంద్రనగర్ SOT బృందం, నిందితుడి నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 15 కిలోల జింక మాంసంతో పాటు కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న మాంసాన్ని తదుపరి చర్యల నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు జింకను ఎక్కడ వేటాడాడు? ఇందులో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రమైన నేరం..

అడవి జంతువులను వేటాడటం లేదా వాటి మాంసం, చర్మం విక్రయించడం తీవ్రమైన నేరం. జింకలను వేటాడితే నిందితులకు 3 నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది. వన్యప్రాణి చట్టం ఉల్లంఘన కింద నమోదయ్యే కేసులు చాలా వరకు నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు. కేవలం విక్రయించే వారే కాదు, వన్యప్రాణుల మాంసం లేదా ఇతర శరీర భాగాలను కొనుగోలు చేసే వారు కూడా చట్టం ప్రకారం నేరస్తులే అవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.