AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన చనిపోయిన అభ్యర్థి.. చివరకు అధికారులు ఏం చేశారంటే..?

ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికలో విషాదం..విజయం కలగలిశాయి. నామినేషన్ వేశాక మరణించిన చెర్ల మురళికి అనూహ్య విజయం దక్కింది. సాధారణంగా ఎన్నిక నిలిపివేయాల్సి ఉన్నా, అధికారులు కొనసాగించారు. ఈ క్రమంలో ఉపసర్పంచ్‌ను ఎన్నుకున్నారు కానీ.. సర్పంచ్ ఎన్నికపై అధికారులు కీలక ప్రకటన చేశారు.

Telangana: సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన చనిపోయిన అభ్యర్థి.. చివరకు అధికారులు ఏం చేశారంటే..?
Deceased Candidate Wins Election
G Sampath Kumar
| Edited By: Krishna S|

Updated on: Dec 12, 2025 | 8:27 AM

Share

సాధారణంగా నామినేషన్ వేసిన వ్యక్తి స్క్రూటినీ తర్వాత కూడా బరిలో ఉండి అకస్మాత్తుగా చనిపోతే.. ఆ ఎన్నిక నిలిపేస్తారు. కానీ అక్కడ మాత్రం అధికారులు ఎందుకో ఎన్నిక కొనసాగించారు. అనూహ్యంగా ఆయన మరణమే.. తన విజయానికి కారణమైందో ఏమో.. విషాదంలో దక్కిన ఆ విజయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఆ ఘటనతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు.. సర్పంచ్ అభ్యర్థి ప్రకటననే హోల్డ్‌లో పెట్టారు. ఉపసర్పంచ్ ను మాత్రమే ప్రకటించి వెనుదిరిగారు. దాంతో అక్కడి సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఎన్నికలో.. విషాదంలో విశేషం అందరినీ నిశ్ఛేష్ఠుల్ని చేసింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి అనే వ్యక్తి తన నామినేషన్ దాఖలు చేశాక.. ఈ నెల డిసెంబర్ 5న గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎన్నికను నిలిపివేస్తారు. కానీ చింతల్ ఠాణా ఆ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోలేదో.. లేక ఇంకేదైనా వెసులుబాటుండేనో తెలియదుగానీ.. ఎన్నికను యథావిధిగా నిర్వహించారు. అయితే మురళి మరణంతో ఆయనపై మరింత సానుభూతి పెరగడంతో మృతుడికే మెజారిటీ ఓట్లు దక్కాయి. దాంతో మృతుడు చెర్ల మురళీ తన సమీప ప్రత్యర్థి పై 370 ఓట్లతో గెలుపొందాడు.

కానీ అధికారులు అధికారికంగా ఈ విజయాన్ని ప్రకటించలేదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సర్పంచ్‌గా ఎలా ఆ సీటును భర్తీ చేస్తాడన్న మీమాంసతో.. మొత్తంగా చింతల్ ఠాణా ఎన్నికలో సర్పంచ్ ఫలితాన్నే హోల్డ్ లో పెట్టారు. మొత్తం పోలైన 1717 ఓట్లలో మృతుడు చెర్ల మురళికి 739 ఓట్లు రాగా.. బీజేపీ సురువు వెంకటికి 369, కాంగ్రెస్ బలపర్చిన కోలాపురి రాజమల్లుకు 333 ఓట్లు వచ్చాయి. 10 వార్డుల్లో గెలుపొందిన వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌గా కుమార్‌ను ఎన్నుకున్నారు. దీంతో ఉపసర్పంచ్‌ను ప్రకటించిన అధికారులు.. సర్పంచ్ ఎన్నికను మాత్రం ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక సమర్పిస్తామని హోల్డ్‌లో పెట్టారు. . ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. కానీ గ్రామస్థులు మాత్రం ఎన్నికపై ప్రకటన చేయాలని డిమాండ్ చేయగా.. ఎలాగోలా అధికారులు స్థానికులను ఒప్పించి బయటపడ్డారు.

ఓవైపు చెర్ల మురళి మృతి స్థానికంగా విషాదం రేపితే.. నేటి ఎన్నికలో విజయం దక్కడంతో ఒక విచిత్రమైన పరిస్థితి చింతల్ ఠాణాలో కనిపించింది. విషాదానికి దుఃఖపడుతున్న కాలాన.. విజయం దక్కడంతో ఆ గ్రామస్థులకే ఏం మాట్లాడాలో తెలియని స్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ అనుభవం కాని ఒక భిన్నమైన సమస్య అధికారులు తలలు బద్ధలు కొట్టుకునేలా చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.