AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra – Telangana: ఏంటీ సారు ఇది.. పోలీసుల ‘పెంట’ పంచాయితీ.. శ్రీశైలం డ్యామ్‌లో కొట్టుకుపోయిన డెడ్‌బాడీ

బతికున్నప్పుడు అతడికో ఊరుంది, పేరూ ఉండేది. చనిపోయిన తర్వాత ఊరూపేరూ లేని అనాథయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాలకూ కానివాడై సరిహద్దుల్లో ఒంటరిగా మిగిలిపోయాడు. ఔను.. మిగిలి.. పోయాడు. ఇంతకీ ఎవరో అతగాడు? చనిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల పోలీసులకూ మోస్ట్ వాంటెడ్ ఎలా అయ్యాడు?

Andhra - Telangana: ఏంటీ సారు ఇది.. పోలీసుల ‘పెంట’ పంచాయితీ.. శ్రీశైలం డ్యామ్‌లో కొట్టుకుపోయిన డెడ్‌బాడీ
Srisailam Dam
Shaik Madar Saheb
|

Updated on: Nov 01, 2025 | 9:32 PM

Share

శ్రీశైలం రిజర్వాయర్‌లో తేలియాడుతున్న ఈ మృతదేహం… ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య సరిహద్దు పంచాయతీకి దారితీసింది. ఈనెల 27న డ్యామ్ దిగువన గుర్తు తెలియని డెడ్ బాడీగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు జాలర్లు. కానీ, మృతదేహం తమ పరిధిలో లేదని చేతులెత్తేశారు తెలంగాణ సరిహద్దుల్లోని ఈగలపెంట పోలీసులు. ఆ మాటకొస్తే డెడ్‌బాడీ కొట్టుకొచ్చిన ప్రాంతం మా స్టేషన్ రేంజ్‌లో కూడా లేదని అస్సలు పట్టించుకోలేదు ఏపీలోని సున్నిపెంట పోలీసులు. సున్నిపెంట, ఈగలపెంట మధ్య కొట్టుమిట్టాడిన ఈ మృతదేహం ఎవరిది? అతడి చావు వెనుక మర్మమేంటి అనేది మరో క్రైమ్ స్టోరీ.

పేరు కురుమూర్తి, వనపర్తిలోని గణేశ్ నగర్ కాలనీ.. ఇతడి కేరాఫ్. ఒక షాపింగ్‌మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా నౌకరీ. భార్య, ఇద్దరు పిల్లలు. ఇదే కాలనీలో బైక్ మెకానిక్ శ్రీకాంత్ వీళ్ల ఫ్యామిలోకి జొరబడ్డ విలనీ క్యారెక్టర్. కురుమూర్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అడ్డు తొలగించుకోవాలని స్కెచ్చేసి, తీవ్రంగా కొట్టి.. ఊపిరాడకుండా దిండుతో చంపి హత్య చేశారు. ఇద్దరూ కలిసి కురుమూర్తిని చంపిన తర్వాత.. మృతదేహాన్ని కార్లో తీసుకెళ్లి శ్రీశైలం డ్యామ్‌లో పడేశారు. ఇదీ క్లుప్తంగా కురుమూర్తి డెత్ స్టోరీ.

హత్య జరిగిన తరువాత ఏం జరిగిందంటే..

హత్య అక్టోబర్ 25న జరిగింది. 27వ తేదీన మృతదేహం జాలర్ల కంట పడింది. సమాచారమిచ్చినా ఏ పోలీసులూ పట్టించుకోకపోవడంతో నీటిలోనే తేలియాడుతూ కొట్టుకుపోయింది కురుమూర్తి మృతదేహం. నిందితులిచ్చిన సమాచారంతో వనపర్తి పోలీసులు ఆరామ్‌గా శ్రీశైలం డ్యామ్ దగ్గరకొచ్చి ఆరా తీశారు. తీవ్రంగా గాలించారు. కానీ, డెడ్ బాడీ మిస్సింగ్…! హత్య జరిగి దాదాపు వారం రోజులౌతోంది గనుక మృతదేహం నీళ్లలో ఎంతదూరం కొట్టుకుపోయిందో తెలీదు. మృతదేహం దొరికితేనే మర్డర్ కేసు దర్యాప్తు ముందుకు నడిచే ఛాన్సుంది. దొరికిన మృతదేహాన్ని నీళ్లకొదిలేసి చోద్యం చూసిన సున్నిపెంట, ఈగలపెంట పోలీసులు ఇప్పుడేం చెబుతారు? రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇదో రకమైన వింత పంచాయితీ.. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..