AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narketpally: అత్తా కోడళ్లు ఇద్దరూ కలిసి ఆందోళనకు దిగారు.. ట్విస్ట్ ఏంటంటే..?

సాధారణంగా అత్తా కోడళ్లు.. అంటే ఒకరికి ఒకరు సరిపడదు. ఏ విషయంలోనూ ఇద్దరిదీ ఒకే అభిప్రాయం ఉండదు. కానీ ఓ విషయంలో మాత్రం అత్తా కోడళ్ళు ఒకటయ్యారు. తమ భర్తలు చేసిన నిర్వాకానికి ఆ అత్తా కోడళ్లు.. ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Narketpally: అత్తా కోడళ్లు ఇద్దరూ కలిసి ఆందోళనకు దిగారు.. ట్విస్ట్ ఏంటంటే..?
Women Protest
M Revan Reddy
| Edited By: |

Updated on: May 09, 2025 | 12:54 PM

Share

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన బద్దుల మల్లేశ నల్లగొండ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 12ఏళ్ల క్రితం మల్లేశ భార్య మృతిచెందగా, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం కోసం చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన యాదమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె ద్వారా సంతానం లేదు. మల్లేశ తన మొదటి భార్యకు కలిగిన నలుగురి సంతానానికి పెళ్లిళ్లు చేశాడు.

మల్లేష్ రెండో కుమారుడు మహేష్ తిప్పర్తి మండలానికి చెందిన దుర్గామల్లేశ్వరితో 2021లో వివాహం చేశాడు. మహేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తుండగా, భార్య దుర్గామల్లేశ్వరి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే  రెండేళ్ల క్రితం మహేష్ తండ్రి మల్లేశ కుటుంబ వివాదాలతో  తన భార్య యాదమ్మను ఇంటినుంచి గెంటి వేశాడు. దీంతో యాదమ్మ తల్లి గారిల్లు అయిన నేరడకు వెళ్లి పలుమార్లు పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టింది.

ఇదిలా ఉండగా మల్లేశ రెండో తనయుడు మహేశ్ కూడా భార్య దుర్గామల్లేశ్వరితో ఏడాది క్రితం గొడవపడి ఆమెను తల్లిగారింటికి పంపగా, పెద్దమనుషుల పంచాయితీకి చేరింది. వారం రోజుల క్రితం దుర్గామల్లేశ్వరికి మహేష్‌ విడాకుల నోటీస్‌ పంపించాడు. దీంతో దుర్గా మల్లేశ్వరి బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం భరిస్తూ వచ్చిన దుర్గామల్లేశ్వరి.. కుటుంబ సభ్యులతో నార్కట్‌పల్లికి వచ్చి అత్తగారింటి ఎదుట ధర్నాకు దిగింది. కోడలు ధర్నాకు దిగిన విషయం తెలుసుకున్న యాదమ్మ కూడా తనకూ తన భర్త మల్లేశ అన్యాయం చేశాడని ఆరోపిస్తూ కోడలితోపాటు దీక్షలో కూర్చుంది. భర్తలు చేసిన నిర్వాకానికి ఓపిక నశించిన ఆ అత్తా కోడళ్లు  ఇంటి ఎదుట నిరసనకు దిగారు. అత్తాకోడళ్ల ఆందోళనకు మహిళా సంఘాల నాయకురాళ్ళు పాలడుగు ప్రభావతి, సరోజ, నాగమణిలు అండగా నిలిచారు. దీక్షలో సక్కు లక్ష్మమ్మ, బాల నర్సమ్మ, లింగాల మల్లమ్మ, రేణుక, పార్వతమ్మ పాల్గొన్నారు. అయితే అత్తాకోడళ్ల ఆందోళన విషయం ముందే తెలుసుకున్న తండ్రీకుమారులిద్దరూ ఇంటికి తాళం వేసి పరారయ్యారు.