
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో నెంబర్ గేమ్ రాజకీయం తెరమీదకు తెచ్చాయి ఇరు పార్టీలు.
పార్లమెంట్ ఎన్నికల ముందు పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక. నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో అభ్యర్థుల తుది రూపు ఖరారయ్యింది. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా రాజకీయాలు రంజుగా మారాయి. బీఆర్ఎస్ కు క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఓటర్ల బలం ఉంటే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో అధికార బలం ఉంది. దీంతో ఈ ఉప ఎన్నికలో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటి పడుతున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరు మొదటి నుంచి రసవత్తరంగా మారింది. జిల్లా స్థానిక సంస్థల ఓటర్ల బలం లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలపడం రాజకీయాలను హీటెక్కించాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందు కొంత మంది ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి తోడుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో మిగిలిన వాళ్ళలో మెజారిటీ సభ్యులు హస్తం గుర్తుకు ఓటేస్తారని భావిస్తున్నారు. నిన్నటి వరకు చేరికలను నిషేధించిన కాంగ్రెస్ నేడు ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది. బీఆర్ఎస్లో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ వైపు ఆకర్షించేందుకు ఇప్పటికే పలు హామీలు సైతం ఇచ్చింది కాంగ్రెస్. పాలమూరు ప్రజా దీవెన సభ వేదికగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని.. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల బిల్లులు సైతం విడుదల చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల నోటిఫకేషన్ అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే కార్యక్రమం కొనసాగుతోంది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో మొత్తం 1,439 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంపీటీసీలు 888, జడ్పీటీసీలు 83, కౌన్సిలర్లు 449, ఎమ్మెల్యేలు 14, ఎమ్మెల్సీలు ఇద్దరు, ఎంపిలు ఇద్దరు ఉన్నారు. అయితే ఇందులో దాదాపు 850కి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లోనే ఉన్నారు. కాంగ్రెస్‌కు సుమారుగా 400పైచిలుకు ఓటర్లు ఉన్నారు. బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలుపుకొని మరో 100వరకు ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. పూర్తిగా నెంబర్ మీదే ఆధారపడి ఉన్న ఎన్నిక కావడంతో కాంగ్రెస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ సీటు గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం హామీ మేరకు ప్రతి ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను సంప్రదిస్తున్నారు. వారి సమస్యలు, అవసరాలు తెలుసుకొని పార్టీలో చేర్చుకోవడం లేదా తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఉన్న బలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. తాజా వలసలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో త్వరలోనే రహస్య శిబిరాలు ఏర్పాటు చేసే యోచనలో గులాబీ నేతలు ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లను అభ్యర్థించారు.
పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. రానున్న మరికొన్ని రోజుల్లో ఈ చేరికలు జోరందుకునే అవకాశం ఉందని హస్తం శ్రేణులు చెబుతున్నాయి. దీనికి తోడు క్రాస్ ఓటింగ్ తోనైన ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధిస్తామనే యోచనలో ఉన్నారట కాంగ్రెస్ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..