Telangana Congress: టీ-కాంగ్రెస్‌లో మరమ్మతుల పర్వం.. డిగ్గీ రాజా ఎంట్రీతో ‘వలసదారుల’ ముఖచిత్రాలేంటి..? సీనియర్ల ప్లాన్ అదేనా..?
గాంధీభవన్‌కి కొత్త హెడ్‌మాస్టర్ వచ్చేస్తున్నారు. అసంతృప్తుల్ని బుజ్జగించడానికి అధిష్టానం దూతగా డిగ్గీ రాజా పేరు ఖరారైంది. కలిసుంటేనే కలదు సుఖం.. విడిపోతే ఓడిపోవుడే..

గాంధీభవన్‌కి కొత్త హెడ్‌మాస్టర్ వచ్చేస్తున్నారు. అసంతృప్తుల్ని బుజ్జగించడానికి అధిష్టానం దూతగా డిగ్గీ రాజా పేరు ఖరారైంది. కలిసుంటేనే కలదు సుఖం.. విడిపోతే ఓడిపోవుడే.. అనే థియరీతో పార్టీకి రిపేర్లు మొదలుపెడతారని తెలుస్తోంది. ఇంతకీ… సగానికి తెగిన చెయ్యిగుర్తును అతికించడం దిగ్విజయ్ సింగ్ వల్ల అయ్యే పనేనా? ఇంతకీ ట్రబుల్ షూటర్‌గా ఆయన ట్రాక్ రికార్డేంటి..? అనేది చర్చనీయాంశంగా మారింది..
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ వైపు సీనియర్లు, మరోవైపు జూనియర్లుగా విడిపోయిన నేతలు.. అధిష్టానం నుంచి కొత్త దూత దిగ్విజయ్ సింగ్ వస్తున్నారహో అనే దండోరాతో అసంతృప్తులంతా సర్దుకున్నారు. ఆల్‌ఈజ్‌వెల్ అనకపోయినా.. ఆలోచిద్దాంలే అంటూ సయోధ్యకు సైడిచ్చేశారు. కొత్త కుంపటి రెండో దఫా సమావేశం వాయిదా పడింది.. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు చేరుకుని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుండగానే ఆ డిగ్గీరాజాకు అంత సీనుందా..? నిలువునా చీలిన తెలంగాణా కాంగ్రెస్‌కి ఆయనిచ్చే ఫెవికాల్ ట్రీట్‌మెంట్ సరిపోతుందా? అనే సందేహాలు పార్టీ క్యాడర్‌ని పొడుస్తూనే ఉన్నాయి. క్రైసిస్ మేనేజర్‌గా, ట్రబుల్ షూటర్‌గా దిగ్విజయ్ ట్రాక్ రికార్డ్ మీద స్పెషల్‌గా ఫోకస్ పడిందిప్పుడు.
మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్.. ముగ్గురూ కూడబలుక్కుని యుద్ధ ప్రాతిపదికన గాంధీ భవన్‌కి రిపేర్లు చేపట్టారు. హైకమాండ్ ప్రపోజల్స్‌ని జేబులో పెట్టుకుని మరో రెండురోజుల్లో హైదరాబాద్‌కు రాబోతున్నారు తాజా మాజీ పెద్దకాపు దిగ్విజయ్‌సింగ్. గతంలో అస్సోం, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలక్కూడా ఇన్‌చార్జిగా చేసినప్పటికీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌తో స్పెషల్ ఎటాచ్‌మెంట్ ఉంది దిగ్విజయ్‌కి. చాలాసార్లు సంక్షోభాల్ని చక్కదిద్దినప్పటికీ ఒకట్రొండు క్లీన్‌బౌల్డ్ సీన్లు కూడా లేకపోలేదు.




ఏపీ విభజన ఎపిసోడ్‌లో డిగ్గీ ఫ్యాక్టర్..
ఏపీ విభజన ఎపిసోడ్‌లో డిగ్గీ ఫ్యాక్టర్ గట్టిగానే ఉంది. ఎంతో రిస్కు తీసుకుని ఏపీని విభవించినా పొలిటికల్‌గా కాంగ్రెస్‌కి దక్కింది మాత్రం గుండుసున్నా. తెలంగాణ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్‌కు దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా చేశారని. సరైన ప్లానింగ్ లేకుండా రాష్ట్రాన్ని తీసుకెళ్లి కేసీఆర్ చేతుల్లో పెట్టారని దిగ్విజయ్‌పై పార్టీలో బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడింది. పైగా… ఇప్పుడు తిరుగుబాటు చేసిన సీనియర్లలో చాలామంది దిగ్విజయ్ పట్ల సానుకూలత లేనివారే.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక్కరే దిగ్విజయ్‌తో పర్సనల్ టచ్ మెయిన్‌టెయిన్ చేసేవారు. మాకు మళ్లీ దిగ్విజయే కావాలని అనేకసార్లు కోమటిరెడ్డి నుంచి అప్పీళ్లు కూడా వెళ్లాయి. ఇప్పుడు దూతగా వస్తున్న డిగ్గీరాజా.. కోమటిరెడ్డి గ్రూప్ వైపు సాఫ్ట్‌కార్నర్ చూపుతారా..? అనే సందేహాలు కూడా లేకపోలేదు.
ఆజాద్ లేకపోవడంతో..
అప్పట్లో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల్ని చక్కదిద్దడంలో ఆరితేరిన మరో నేత గులామ్ నబీ ఆజాద్. తెలుగు నాట కాంగ్రెస్ పార్టీకి స్వర్ణయుగంలా నడిచిన 2004, 2009 ఎన్నికల సందర్భాల్లో రెండుసార్లూ ఆజాదే ఇన్‌ఛార్జ్. ముఖ్యంగా తెలంగాణా కాంగ్రెస్ నేతల్ని డీల్ చేయడంలో ఆజాద్‌కు మంచి పట్టుంది. కాకపోతే.. ఆజాద్ ఇప్పుడు కాంగ్రెస్‌తో లేరు. బైటికెళ్లిపోయి డెమొక్రటిక్ అజాద్ పార్టీ పేరుతో కాశ్మీర్‌లో కొత్త పార్టీ పెట్టుకున్నారు. అందుకే.. సెకండ్ బెస్ట్ ఆప్షన్ డిగ్గీరాజా మాత్రమేనని నమ్మినట్టుంది హైకమాండ్.
కాంగ్రెస్‌లో సంక్షోభాలు కొత్త కాదు. కాకపోతే.. గతంలో సంక్షోభాలకు ఇప్పుడు ముంచుకొచ్చిన సంక్షోభానికీ పోలికే లేదు. సీనియర్లు, జూనియర్లు.. అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అంటూ నిట్టనిలువునా చీలిపోయింది టీ-కాంగ్రెస్. గాంధీభవన్‌లోనే అడ్డుగోడలు కట్టుకునే తీవ్రమైన పరిస్థితి. ఒకరి మొహాలు మరొకరు చూసుకోడానిక్కూడా ఇష్టం పడ్డం లేదు.
హస్తం పార్టీలో తారాస్థాయికి లొల్లి..
చెయ్యిపార్టీలో పరిస్థితి పూర్తిగా చెయ్యిదాటిపోయింది. గంపగుత్తగా గోడ దూకినా దూకేస్తారనే స్థాయిలో శబ్దాలొచ్చేశాయి. జిల్లాల వారీగా పట్టున్న లీడర్లు లేక.. సతమతమవుతున్న తెలంగాణా బీజేపీ.. టీ-కాంగ్రెస్‌లో కొత్త కుంపటి మీద ఫోకస్ పెట్టేసింది. కొన్నాళ్లనుంచి సైలెంట్‌గా కూర్చున్న చేరికల కమిటీ ఛైర్మన్ ఈటెలకు చేతినిండా పని దొరకబోతున్నట్టు సంకేతాలున్నాయి. మీరొస్తామంటే మేమొద్దంటామా అంటూ గాంధీభవన్‌లో అసమ్మతులందరినీ టోకు పద్ధతిని ఆఫర్లు కూడా వెళ్లాయట. ఈ పరిస్థితుల్లో డిగ్గీ రాజా ఇవ్వబోయే ఫెవికాల్ ట్రీట్‌మెంట్ వర్కవుట్ అవుతుందా? ఆయన ఏ వర్గం వైపు మొగ్గు చూపినా.. మరో వర్గం నుంచి మంటలు రిపీటయ్యే ప్రమాదం ఉండదా?
కంట్రోల్ అవుతారా..?
దిగ్విజయ్ సింగ్ వచ్చి సమస్యను పరిష్కరిస్తే మంచిదే అని ఒకరిద్దరు సీనియర్లు ఆశాభావంతో ఉన్నారు. కానీ.. ఇంత లోతైన సంక్షోభాన్ని కంట్రోల్‌లోకి తీసుకురావడం అంటే మాటలతో అయ్యే పని కాదు. అంత గొప్ప తంత్రవిద్యలు దిగ్విజయ్ దగ్గర ఏమేం ఉన్నాయన్న క్యూరియాసిటీ… తెలంగాణా పాలిటిక్స్‌ని మళ్లీ ఇంట్రస్టింగ్‌గా మార్చేసింది. కానీ.. రాజస్థాన్, కర్నాటకల్లో ఇంతకంటే పెద్దపెద్ద క్రైసిస్‌లనే ఫేస్ చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణా సంక్షోభాన్ని చూసి జడుసుకుంటుందా ఏంటి?
సో.. డిగ్గీ రాజా ఎంట్రీతో ఎపిసోడ్ మొత్తం పూర్తిగా టర్న్ అయింది. జానారెడ్డిని థర్డ్ ఎంపైర్‌గా పెట్టి సమస్యను సర్దేద్దామని రేవంత్ గీసుకున్న స్కెచ్‌ని చించి పారేసింది హైకమాండ్. రేవంత్‌కీ, దిగ్విజయ్‌కీ గత పరిచయాల్లేవన్నది కూడా ఇక్కడ రిమార్కబుల్ పాయింట్. ఇప్పుడు కొత్త కమిటీల్ని మార్చి.. అసంతృప్తుల పేర్లను చేర్చి.. అంతకంటే కొత్తగా తయారు చేయడమైతే గ్యారంటీ. అంతమాత్రాన సీనియర్లు చల్లబడతారా.. వాళ్లు రిపీటెడ్‌గా అడుగుతున్న పీసీసీ ప్రెసిడెంట్ కుర్చీ మార్పును కూడా పరిశీలిస్తారా అనేది పార్టీ శ్రేణుల్లో సస్పెన్స్ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..