Telangana: కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.! చాక్ పీస్ పట్టి.. లెక్కల మాస్టర్‌గా మారి..
మనం ఇప్పటి వరకు పాఠాలు అంటే టిచర్‌లు బోధించడమే చూసి ఉంటాం.. కానీ తాజాగా ఓ కలెక్టర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అంతేకాకుండా విద్యార్థుల సందేహాలను సైతం నివృత్తి చేశారు. ఇది ఖమ్మం జిల్లాలో జరిగింది..
పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠాలు బోధిస్తూ ఉంటారు. కానీ ఈ పాఠశాలలో ఓ కలెక్టర్ లెక్కల మాస్టర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజజ్మిల్ ఖాన్ పాలేరు నియోజకవర్గం ఖమ్మం గ్రామీణ మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మండలంలో జరుగుతున్న ఇంటింటి సర్వేని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా సందర్శించారు.
పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని ఆరోవ తరగతి చదువుతున్న విద్యార్థుల క్లాస్ రూమ్‌లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తానే ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు లెక్కలు బోధించారు. విద్యార్థులకు వచ్చిన సందేహాలను సైతం నివృత్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడుగా మారి తమకు పాఠాలు బోధించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.