Telangana Weather: రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పొడి వాతావరణం.. ఆ జిల్లాల్లో మాత్రం చలి పులి.. వెదర్ రిపోర్ట్
తెలంగాణలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో.. ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి గజగజలాడుతున్నారు జనం
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పొడి వాతావరణం ఉండొచ్చని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాలు సాధారణం కంటే చలిగా ఉంటాయని… ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి నాగర్‌కర్నూల్ వంటి దక్షిణ జిల్లాల్లో వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఉత్తరాది జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌గానూ, దక్షిణ, మధ్య జిల్లాల్లో 16 డిగ్రీల నుంచి 19 డిగ్రీల సెల్సియస్‌గానూ నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తరాది జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఉప్పల్, మలక్‌పేట్, రాజేందర్‌నగర్, శేర్‌లింగంపల్లి, మూసాపేట్, చందానగర్, కుకట్‌పల్లి, చార్మినార్, గోషామహల్, ఎల్‌బీ నగర్ వంటి నగరంలోని చాలా ప్రాంతాలు 20 డిగ్రీల నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటాయి.
ఉమ్మడి ఆదివాసీ జిల్లాల్లో .. చలి… వణికిస్తోంది. ఆదివాసీ పల్లెల్లో మంచుదుప్పటి కప్పేసినట్టుంది. కొమురంభీం జిల్లా ఏజేన్సీలో తీవ్రంగా పడిపోతోన్న ఉష్ణోగ్రతలతో చలి బాగా పెరిగింది. పగలు తొమ్మిదవుతున్నా సూర్యుడి జాడకనపడటంలేదు. దీంతో జనజీవనం ఆలస్యం ఆరంభం అవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ఆదివాసీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయి, చలితీవ్రత పెరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..