CM Revanth Review: రాబడులు ఎలా పెంచాలి..? ఖజానా నిండేదెలా..? కసరత్తు మొదలు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వసూళ్ల పెంపుపై దృష్టి సారించింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా వంటి అన్ని శాఖల నుండి లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం అందాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వసూళ్ల పెంపుపై దృష్టి సారించింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా వంటి అన్ని శాఖల నుండి లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం అందాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో, మంగళవారం(అక్టోబర్ 15) నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రోజూ ఒకో శాఖను సమీక్షించనున్నారు.
గత వారం, ఆదాయం బడ్జెట్‌కి తగ్గట్లుగా రాకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గడం వంటి సమస్యలను పరిగణనలోకి తీసుకొని సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితోపాటు ఆర్థిక, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ వంటి కీలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు లక్ష్యాల కంటే 20% తగ్గాయని తేలింది. రాబోయే ఆరు నెలల్లో లక్ష్యాలను చేరుకోవడానికి మరియు మొదటి ఆరు నెలల్లో వచ్చిన తగ్గుదలని భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఇతర రాష్ట్రాలలో రెవెన్యూ వసూళ్లు ఎలా పెరిగాయి? వాటికి కారణాలేమిటి? అక్కడ అమలు చేసిన సంస్కరణలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూళ్లను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంది? వంటి విషయాలను సమగ్రమైన అధ్యయనం చేయాలని, అవసరమైతే కొంతమంది అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించాలని సీఎం సూచించారు. పన్నుల వసూళ్లపై నిరంతర పర్యవేక్షణ, ఆడిట్‌లు, తనిఖీలు, అప్పీల కేసుల పరిష్కారంపై నివేదికలు సమర్పించాలని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంబంధిత శాఖలు కార్యాచరణలో నిమగ్నమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షల అనంతరం కొన్ని సంస్కరణలు తీసుకురావచ్చని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..