Navy Radar Station: నేడు దామగుండం నేవీ రాడార్ స్టేషన్ శంఖుస్థాపన.. మూసీ అంతర్ధానం అవుతుందా?
రాడార్ స్టేషన్ ఏర్పాటుకి అనువైన ప్రాంతం సముద్ర తీరం. ఆ ఛాన్సే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. మూసీ అంతర్ధానం అవుతుందన్న వాదనలో నిజమెంత?
రాడార్ స్టేషన్ ఏర్పాటుకి అనువైన ప్రాంతం సముద్ర తీరం. ఆ ఛాన్సే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దామగుండం.. అగ్ని గుండంలా మారబోతుందా? మూసీ అంతర్ధానం అవుతుందన్న వాదనలో నిజమెంత? అసలు దామగుండానికి మూసీకి ఉన్న లింకేంటి? ఇదే తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా సాగుతున్న చర్చ.
ఇవాళ(మంగళవారం 15) వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సహా పలువురు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం నేవీకి 2900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.
వికారాబాద్‌జిల్లా పూడుర్ మండలంలోని దామగుండం ఫారెస్ట్ ఏరియా ఇది. దీని విస్తీర్ణం 3,261 ఎకరాలు. అడవిని ఆనుకుని దాదాపు 20 పల్లెలు, తండాలు ఉన్నాయి. పశువుల మేత, ఇతరత్రా అవసరాలకు స్థానిక ప్రజలు ఈ అడవిపైనే ఆధారపడుతారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటి వనరులు, వాగులు వంకలున్నాయి. ఆహ్లాదకరంగా ఉండే అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అలాంటి ప్రాంతంలో వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది కేంద్రం. సముద్రమే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు ఏంటన్నది చాలామందిలో వ్యక్తమవుతున్న అనుమానం.
భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దామగుండం ఫారెస్ట్ ఏరియాలో రాడార్ స్టేషన్ నిర్మించాలని నేవీ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 2,901 ఎకరాల భూమిని నేవీకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. రాడార్ ఏర్పాటు చేస్తే పనిచేసే సిబ్బంది స్థానికంగానే నివసించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 600మంది పనిచేస్తారని అంచనా. వాళ్లంతా ఉండటానికి వీలుగా టౌన్‌షిప్ నిర్మిస్తారు. ఆస్పత్రులు, బ్యాంక్, మార్కెట్ ఇలా అన్నీ ఇక్కడకు వస్తాయి. చుట్టూ 27కిలోమీటర్ల మేర గోడ నిర్మిస్తారు. దాదాపు రెండున్నర వేల మంది నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలో రెండో వీఎల్‌ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను నేవీ ఏర్పాటు చేస్తోంది. ఈ వీఎల్‌ఎఫ్ స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గాములతో కమ్యూనికేషన్ చేస్తారు. అలాగే రక్షణ రంగంతో పాటు రేడీయో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు. అయితే.. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో 2,900 ఎకరాల్లో 12లక్షల చెట్లను తొలగిస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 208 రకాలకు చెందిన జీవరాశులు ప్రమాదంలో పడనున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీనది ప్రక్షాళన చేస్తామంటోన్న ప్రభుత్వం, దాని జన్మస్థానం అయిన అనంతగిరి కొండల్లో ఈ ఫారెస్ట్‌ను లేకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాల నిర్ణయంతో హైదరాబాద్‌కు వరద ముంపు ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ స్టేషన్‌కి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు దశాబ్దకాలంగా అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం స్టేషన్ ఏర్పాటువైపు మొగ్గుచూపాయి.
ఆరోపణలు, అనుమానాల మధ్య ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాడార్ ప్రాజెక్ట్‌కి కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో 48శాతం మాత్రమే స్టేషన్ నిర్మాణానికి ఉపయోగిస్తారని చెబుతున్నారు. మిగిలిన 52శాతం అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగబోదంటున్నారు. ఇక, 12లక్షల చెట్లను తొలగిస్తారన్న వార్తల్లోనూ ఏమాత్రం నిజం లేదంటున్నారు. కేవలం 1.93 లక్షల చెట్ల తొలగింపు మాత్రమే ఉంటుందంటున్నారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. మరోవైపు కోల్పోనున్న చెట్లకు బదులుగా.. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2,348 హెక్టార్లలో 17.55 లక్షల మొక్కలు నాటుతామంటున్నారు. 500ఏళ్లుగా కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నష్టం జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. 32.10 ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు కొలను కూడా అలాగే ఉంటాయన్నారు. భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవంటున్నారు అటవీశాఖ అధికారులు.
విశాఖ కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నావల్ కమాండ్ వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్‌ను నిర్మించబోతోంది. 2,500కోట్ల రూపాయల వ్యయంతో 2027నాటికి ఈ స్టేషన్‌ని అందుబాటులోకి తీసుకురావాలని నేవీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రాడార్ ఏర్పాటుపై రాజకీయ ప్రకంపనలు పీక్స్‌కి వెళ్తున్నాయి. స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్ధానం ఖాయమన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. విపక్షంతో పాటు ప్రజాసంఘాల ఆందోళనతో ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..