AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్‌లో తెలంగాణ రైజింగ్ బృందం బిజీబిజీ.. రెండు ప్రముఖ సంస్థలతో కీలక ఒప్పందాలు

తెలంగాణకు పెట్టుబడుల వరద పారించాలనే లక్ష్యంతో జపాన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అండ్ టీమ్ బిజీ బిజీగా పర్యటిస్తోంది. నాలుగు రోజులుగా జపాన్‌లోనే ఉంది తెలంగాణ రైజింగ్ బృందం. ఇంతకీ ఈ టీమ్ నాలుగో రోజు ఎక్కడెక్కడ పర్యటించింది. ఏమేం ఒప్పందాలు జరిగాయి? తెలుసుకుందాం.

జపాన్‌లో తెలంగాణ రైజింగ్ బృందం బిజీబిజీ.. రెండు ప్రముఖ సంస్థలతో కీలక ఒప్పందాలు
Cm Revanth Reddy And Team Japan Tour
Balaraju Goud
|

Updated on: Apr 20, 2025 | 9:15 PM

Share

తెలంగాణకు పెట్టుబడుల వరద పారించాలనే లక్ష్యంతో జపాన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అండ్ టీమ్ బిజీ బిజీగా పర్యటిస్తోంది. నాలుగు రోజులుగా జపాన్‌లోనే ఉంది తెలంగాణ రైజింగ్ బృందం. ఇంతకీ ఈ టీమ్ నాలుగో రోజు ఎక్కడెక్కడ పర్యటించింది. ఏమేం ఒప్పందాలు జరిగాయి? తెలుసుకుందాం.

జపా‌న్‌​లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం.. కితాక్యూషూ నగరాన్ని సందర్శించింది. నగర మేయర్ కజుహిసా టకేచీని తెలంగాణ బృందం కలిసింది. ఈ సందర్భంగా అక్కడి సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న నగరమే ఈ కితాక్యూషూ. అక్కడి గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. ఆ నగరం అంతగా ఎలా అభివృద్ధి చెందింది. ఎలాంటి ప్రణాళికలు అమలుచేశారనే వివరాలను తెలంగాణ బృందం తెలుకుంది. మురసాకి రివర్ మ్యూజియంతోపాటు ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్‌నూ సందర్శించింది రేవంత్ టీమ్.

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగేసింది. జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలైన టెర్న్, రాజ్‌ గ్రూప్‌లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్‌ కేర్‌తోపాటు పలు రంగాల్లో జపాన్ సహకారం విస్తరించనుంది. ఈ ఒప్పందాలతో ఆరోగ్యరంగంలో 200, ఇంజినీరింగ్‌లో 100, టూరిజంలో 100, నిర్మాణరంగంలో 100 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

టోక్యో చేరిన తొలి రోజే జపాన్ పారిశ్రామిక దిగ్గజం మారుబెనీ కార్పొరేషన్‌తో భారీ ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలోని 600 ఎకరాల్లో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేయనుంది. ప్రారంభ దశలోనే వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ పార్క్ ద్వారా మరిన్ని జపాన్, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 వేల కోట్లకుపైగా పెట్టుబడులు.. 30 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించబడే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తోంది.

టోక్యోలోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. అనుబంధ సంస్థ అయిన క్రంచిరోల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో రేవంత్ భేటీ అయ్యారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్‌ను హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ప్రతిపాదించారు. అలాగే, టోక్యోలోని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్డు లాంటి మెగా ప్రాజెక్టులకు రూ.11వేల 693 కోట్ల విదేశీ రుణం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని టోక్యో తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టులు మైలురాయిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

మరో రెండు రోజులు జపాన్‌లో పర్యటించనుంది తెలంగాణ బృందం. రూ. 50వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌లో పర్యటిస్తున్న రేవంత్ టీమ్.. లక్ష్యాన్ని సాధిస్తుందా.. లేదా.. చూడాలి మరి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..