Chenetha Bandhu: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతుబంధు తరహా చేనేతబంధు.. కసరత్తు మొదలు పెట్టిన సర్కార్!
తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు.
Telangana Handloom Scheme Chenetha Bandhu: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి, వారి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేసుకుంటూ వస్తున్నామన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారిని ఆత్మహత్యలనుంచి దూరం చేసి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నదన్నారు సీఎం కేసీఆర్. బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తున్నామన్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని సీఎం తెలిపారు.
చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు అందిస్తున్నామని సీఎం అన్నారు. ఎగ్జిబిషన్లు , ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమలులోకి తేనున్నామన్నారు. చేనేత కార్మికులకు ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. చేనేత కార్మికులకు అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని సీఎం తెలిపారు.
చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, నేతన్నలకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాల ద్వారా చేనేత సొసైటీలకు ప్రభుత్వం వాటా ధనాన్ని అందించడం, కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు సబ్సిడీలు అందించడం, చేనేత మగ్గాలను ఆధునీకరించడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి విజయవంతగా అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. అవి సత్పలితాలనిస్తున్నాయని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. పద్మశాలీలను సామాజిక ఆర్థిక రంగాల్లోనే కాకుండా రాజకీయ పాలనా వ్యవస్థల్లో కూడా ప్రోత్సహిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం విజయవంతమైన సంగతి విదితమే. తెలంగాణలోని రైతులు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు దఫాలుగా రూ.10 వేలు ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, తాజాగా తెలంగాణలోని నేత కార్మికుల సంక్షేమం కోసం రైతుబంధు తరహాలో త్వరలో చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు, ఈ రంగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగంగా ఉన్న చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి కార్యదర్శిని నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం ఈ శాఖకు కమిషనర్ హోదాలో ఉన్న అధికారి పనిచేస్తుండగా పరిశ్రమల శాఖ నుంచి విభజన తర్వాత కార్యదర్శి హోదాలో అధికారిని నియమించేందుకు కసరత్తులు మొదలైంది. తెలంగాణ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ పాలసీ (టీ–టాప్)ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ తరహా మార్పులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు, చేనేత బంధు పథకం మార్గదర్శకాలకు చేనేత విభాగం తుదిరూపు ఇచ్చినట్లు తెలియవచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల వయసుగల సుమారు 70 వేల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఇప్పటికే నేత కార్మికుల వివరాలను అధికారులు సేకరించారు. సహకారేతర రంగం వారికి కూడా చేనేతబంధు పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలో చేనేత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అలాగే, నేతన్నకు చేయూత పథకం నేత కార్మికుల పొదుపు కోసం ఉద్దేశించింది. ఈ పథకం కింద కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం నిధులు జమ చేస్తే పరిశ్రమలశాఖలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం మరో 16 శాతం నిధులను చేకూర్చనుంది. ఈ పథకం కోసం ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 338 కోట్లు కేటాయించగా నాలుగు రోజుల క్రితం ఈ పథకానికి మరో రూ. 30 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకంపై ఆసక్తి ఉన్న కార్మికులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తమ వివరాలు నమోదు చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ పథకం కింద 26 వేల మందికిపైగా కార్మికులు పేర్లు నమోదు చేసుకొని రూ. 31 కోట్లు పొదుపు చేయగా ప్రభుత్వం రూ. 62 కోట్లు తన వంతు వాటాగా చెల్లించింది. మూడేళ్ల తర్వాత కార్మికులు రూ. 50 వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు రుణం తీసుకొనే వెసులుబాటు ఉండగా కరోనా నేపథ్యంలో గతేడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి కార్మికులకు నిధులు విడుదల చేసింది.
Read Also… TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు