మంగళవారం నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Covid Vaccination: రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ను మంగళవారం నుంచి ప్రారంభించాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వారు దగ్గరలో ఉన్న...
రాష్ట్రంలో కోవిడ్ కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌పై సీఎం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ను మంగళవారం నుంచి ప్రారంభించాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సిఎం కేసీఆర్ కోరారు. సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. అందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఫీవర్ సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందించే విధానం కొనసాగిస్తూనే, పీహెచ్‌సీకి వచ్చిన ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని అధికారులకు తెలిపారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్స కోసం రాష్ట్రంలో అవసరమైన మందులు సమకూర్చుకోవాలిని అధికారులను ఆదేశించారు.