CM KCR: ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలి.. అర్హులైన వారికి ఆ రంగాల్లో రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్
CM KCR on Dalit Bandhu Scheme: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని సీఎం కే. చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో
CM KCR on Dalit Bandhu Scheme: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని సీఎం కే. చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతి ఏటా 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా 20 వేల కోట్లను కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా నాలుగు మండలాల్లో దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ సోమవారం సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలను గౌరవించి.. వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులకు అనుగుణంగా.. దళితబంధును విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెలంగాణ నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తూర్పు దిక్కున మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
కాగా.. రెండు, మూడు వారాల్లోనే దశలవారీగా ఈ నాలుగు మండలాలకు నిధులు విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దేశంలోనే గతంలో ఎప్పుడూ ఇలాంటి పథకానికి రూపకల్పన జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. దశల వారీగా బడ్జెట్లో నిధులు కేటాయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అధికార దర్పంతో కాకుండా కన్నబిడ్డను ఎట్లైతే తల్లిదండ్రులు ఆలనా పాలనా చూస్తారో ఆ పద్ధతిలో వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
ప్రతి సంవత్సరం రెండు లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు వర్తింపచేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అయితే.. వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబంధు అమలు చేసినప్పుడు దళితులు ఎవరు అభ్యంతరం చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత బంధు అమలు విషయంలో మిగతా వర్గాల వారు సహకరించాలని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకంలో డైరీ యూనిట్ కు ఎక్కువగా స్పందన వస్తున్నందున ఎస్సీ వెల్ఫేర్, పశుసంవర్ధక శాఖ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలోనే హుజూరాబాద్‌లో పథకం అమలవుతున్న తీరును కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ వివరించారు. కొత్తగా అమలు చేసే నాలుగు మండలాలు ఉన్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు సూచనలను తీసుకున్నారు.
Also Read: