మంత్రి మల్లారెడ్డికి అగ్నిపరీక్ష.. గెలిస్తే సరిపోదు.. గెలిపించాలి

కష్టపడ్డ.. పూలమ్మిన .. పాలమ్మిన .. మంత్రినయిన అంటూ డైలాగ్ కొడుతున్న ఈ మంత్రికి ఇవేవీ అమ్మాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ ఒక్క పని చేస్తే చాలు వచ్చే టర్మ్‌లో మళ్లీ మినిస్టర్‌ పోస్ట్‌ అంటూ టాస్క్ ఇచ్చారట పార్టీ బాస్‌. కష్టజీవి మల్లారెడ్డి ముందు అధినేత ఉంచిన ఛాలెంజ్‌ ఏంటి? ఆ అమాత్యుడికి వచ్చిన కొత్త కష్టమేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి...

మంత్రి మల్లారెడ్డికి అగ్నిపరీక్ష.. గెలిస్తే సరిపోదు.. గెలిపించాలి
Minister Malla Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 29, 2023 | 6:46 PM

మంత్రి మల్లారెడ్డి రాజకీయ నాయకుడిగా కంటే పంచ్ డైలాగులతో సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆయన వీడియో కనబడితే కనీసం స్క్రోల్ కూడా చెయ్యరు నెటిజన్లు. ఆయన అంతలా ఎంటర్టైన్ చేస్తారన్నది వారి నమ్మకం. మ మ మ మాస్‌ అంటూ చెప్పుకుంటారు ఆయన గురించి. మల్కాజ్‌గిరి ఎంపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మేడ్చల్ ఎమ్మెల్యేగా, ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఎదిగారు మిస్టర్‌ మల్లన్న . మేడ్చల్ నియోజకవర్గంలో ఈసారి కూడా మల్లారెడ్డికే టికెట్ కేటాయించింది బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం. ఇంకేంటి ఈసారి కూడా మేడ్చల్‌లో నెగ్గితే మరోసారి మల్లన్నకి మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. కానీ అక్కడే హై కమాండ్ ఆయనకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిందట.

గత ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన వెంటనే అల్లుడికి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు మల్లారెడ్డి. రేవంత్‌రెడ్డితో పోటీపడి 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి. అప్పటినుంచి మళ్లీ మల్కాజిగిరి సీటు అల్లుడికే కావాలని అడుగుతున్నారు మల్లారెడ్డి. కానీ అనుకోని పరిణామాలతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ వీడడంతో.. అక్కడ పార్టీ జెండా ఎగరేసే బలమైన కొత్త క్యాండేట్ కోసం బీఆర్ఎస్ వెతుకుతోంది. మంత్రి మల్లారెడ్డికే ఈ టాస్క్ అప్పగించారట కేసీఆర్. టికెట్ నీ అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా మల్కాజ్‌గిరి సీటు గెలిపించే బాధ్యత నీదేనంటూ ఆయన భుజస్కంధాలపై పెద్ద బరువే పెట్టారట గులాబీబాస్‌.

మల్లారెడ్డి స్వయంగా మేడ్చల్‌లో గెలవడంతో పాటు మల్కాజ్‌గిరిలో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే వచ్చే ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఉంటుందనేది బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న ఇంటర్నల్‌ టాక్‌. ఇందులో ఏ ఒక్క సీటు ఓడిపోయినా కేబినెట్‌లో ఛాన్సేలేదని మల్లారెడ్డికి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారట. అందుకే రెండు రోజుల క్రితం భారీ ర్యాలీతో మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో యాక్టివిటీ మొదలుపెట్టారు మంత్రి మల్లారెడ్డి. స్థానిక నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వారెవరూ మైనంపల్లితో వెళ్లకుండా బుజ్జగింపులతో పాటు హామీలిస్తున్నారట. ఇప్పుడు మల్లారెడ్డి తన సొంత సీటు మేడ్చల్‌ కంటే మల్కాజ్‌గిరిపైనే ఎక్కువ దృష్టి పెట్టారంటున్నారు అనుచరులు. తప్పుతుందా మరి!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..