AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ ప్లాన్ ఇదే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఏడాదికి పైగా గడువు ఉన్నా.. ఇప్పటినుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటే..

Telangana: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ ప్లాన్ ఇదే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Telangana BJP
Amarnadh Daneti
|

Updated on: Nov 21, 2022 | 6:58 AM

Share

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఏడాదికి పైగా గడువు ఉన్నా.. ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటే.. కారు పార్టీ, కమలం పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటినుంచే నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సీఏం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా బీజేపీ విమర్శలు చేస్తుంటే.. టీఆర్‌ఎస్ నాయకులు కేంద్రంలో మోదీ ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శల బాణాన్ని ఎక్కుపెడుతున్నాయి. ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్‌ తనదైన వ్యూహలకు పదును పెడుతూ ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీపడుతున్నాయి.  బీజేపీ, కాంగ్రెస్ మధ్య నిధుల విషయంలో గత కొంతకాలంగా మాటలయుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపిస్తోందని టీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయించినట్లు బీజేపీ చెప్తోంది. అన్ని రాష్ట్రాలతో సమానంగా చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు మినహా ఒక్కరూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. బీజేపీ మాత్రం జాతీయ రహదారులు మొదలు, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల వరకు అనేక ప్రాజెక్టులు తెలంగాణకు కేటాయించామని స్వయంగా కేంద్రమంత్రులే చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని కమలం పార్టీ అంటుంటే.. మోదీ విధానాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని టీఆర్‌ఎస్ చెబుతూ వస్తోంది.

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి టిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహలను రూపొందిస్తోంది. ప్రధానంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలంగా ఢీకొట్టగలిగే శక్తి తమకే ఉందని నిరూపించుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను కమలం పార్టీ చేస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకులను, టీఆర్‌ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమవైపు మళ్లే విధంగా వ్యూహలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటిరవకు కేంద్రప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మంజూరు చేసింది, ఎంత నిధులు కేటాయించిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజలందరికి.. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తెలియజేస్తామని చెప్పింది.రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ ఇప్పటికే అనేకసార్లు టీఆర్‌ఎస్.. బీజేపీకి సవాల్ చేసింది. ప్రతిగా బీజేపీ నాయకులు కూడా తాము సిద్ధమే అంటూ కండీషన్స్ పెట్టడంతో ఆ సవాళ్లు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందో ప్రజలందరికి వివరిస్తామని చెప్పినప్పటికి.. ఏ విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు. నియోజకవర్గాల వారీ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజంట్ చేస్తారా.. లేదా మరే ఇతర మార్గాల ద్వారా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత బీజేపీ కొంత బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటి. దీంతో తెలంగాణలో అధికారం కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని శామీర్‌పేట సమీపంలో బీజేపీ శిక్షణా తరగతులు నవంబర్ 20వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యాయి. సోమవారం, మంగళవారం కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా సంస్థాగత విషయాలతో పాటు.. రాజకీయ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఏడాది గడువున్నా.. ఇప్పటినుంచే పార్టీలు తమదైన వ్యూహలను రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..