Telangana: విదేశాలకు తెలంగాణ చేప.. కేంద్రం కీలక నిర్ణయం.. లాభం ఎవరికంటే..?
తెలంగాణలో అంతర్జాతీయ ఫిషరీస్ ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.47 కోట్లు మంజూరు చేసింది. కోహెడలో 13 ఎకరాల్లో నెలకొల్పే ఈ హబ్, తెలంగాణ మత్స్య రంగానికి కొత్త ఊపిరి పోస్తుంది. చేపల ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చి, వృథాను అరికట్టడం లక్ష్యం. 5,000 మందికి ఉపాధి, రొయ్యల ఎగుమతికి కొత్త మార్కెట్లు, దక్షిణాది మత్స్య రంగానికి విస్తృత అవకాశాలు తెరుస్తుంది.

దేశంలో పెరుగుతున్న మంచినీటి చేపల ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు చేరవేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఒక అత్యాధునిక అంతర్జాతీయ ఇన్లాండ్ ఫిషరీస్ ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఏకంగా రూ.47 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్ట్‌ను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. చెన్నైకి చెందిన కన్సల్టెన్సీ సంస్థతో డీపీఆర్ సిద్ధం చేయించి, ఇటీవలే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది.
తెలంగాణకే ఎందుకు ఈ ప్రాజెక్ట్?
మత్స్య రంగ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉండటం ఈ కేటాయింపునకు ప్రధాన కారణం. కేంద్ర అధ్యయనాల ప్రకారం.. పీఎం మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అమలులో తెలంగాణ ముందుంది. రాష్ట్రంలో 5.73 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపల ఉత్పత్తి జరుగుతోంది. 2024లో 4.39 లక్షల టన్నుల మంచినీటి చేపలు, 16,532 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత చేప పిల్లలపై రూ.122 కోట్ల వ్యయం చేయడం.. మత్స్య అభివృద్ధి పట్ల రాష్ట్రం చూపుతున్న కట్టుబాటుకు నిదర్శనం. ఈ అంశాలన్నీ కలిపి తెలంగాణకు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కేటాయించారు.
వృథా అరికట్టి.. ఎగుమతి పెంచే లక్ష్యం
ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 147.57 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ.. ఇందులో కేవలం 6శాతం మాత్రమే ఎగుమతుల రూపంలో విదేశాలకు వెళ్తోంది. మిగిలిన ఉత్పత్తిలో ఎక్కువ శాతం వృథా అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఒకే చోట ప్రాసెసింగ్, హ్యాండ్లింగ్, ఎగుమతి సౌకర్యాలను కల్పించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.
స్థానం – నిర్మాణ ప్రణాళిక
ఎగుమతులకు ఎయిర్ కార్గో సౌకర్యం కీలకం కావడంతో ఈ కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంగా ఉండటం జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం, ఆంధ్రప్రదేశ్ పోర్టులకు సులభంగా చేరుకునే అవకాశం ఉండటం అదనపు ప్రయోజనాలు. ఇప్పటికే 10 ఎకరాల భూమిని సేకరించారు. ఈ నెలలోనే టెండర్లను పూర్తి చేసి, డిసెంబరులో శంకుస్థాపన చేయాలని, ఒక్క ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
13 ఎకరాల ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఎగుమతుల ప్రమాణాలు నిర్ణయించే సాంకేతిక విభాగాలు, పరిశోధనా సంస్థలు, కస్టమ్స్ కార్యాలయాలు ఇందులో ఉంటాయి. కోల్డ్ స్టోరేజీలు, పచ్చి, కాల్చిన, ఎండిన చేపల హ్యాండ్లింగ్ యూనిట్లు, శుద్ధి యూనిట్లు, చేపల పచ్చడి, ఇతర ఫుడ్ ప్రోడక్ట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పరిపాలనా కేంద్రాలు, సిబ్బంది నివాసాలు, అతిథి గృహం, హోటల్ సదుపాయాలు కూడా ఉంటాయి.
ఎవరికి లాభం?
ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల మత్స్యకారులు, వ్యాపారులు భారీగా లబ్ధి పొందనున్నారు. స్థానికంగా 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, హోల్‌సేల్ మార్కెట్ ద్వారా 2,000 మందికి వ్యాపార అవకాశాలు లభిస్తాయి. రొయ్యలపై అమెరికా విధించిన సుంకాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులకు కొత్త అంతర్జాతీయ మార్కెట్లకు మార్గం సుగమం అవుతుంది. చేపలతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుంది. ఈ కేంద్రం దక్షిణ భారత మత్స్య రంగానికి కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుందని కేంద్ర మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి నీతు కుమారి ప్రసాద్ అంచనా వేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
